బహిరంగ చర్చకు జూపల్లి, బీరం రెడీ

బహిరంగ చర్చకు జూపల్లి, బీరం రెడీ

కొల్లాపూర్​ టీఆర్ఎస్​లో ముదురుతున్న వివాదం

నాగర్​కర్నూల్, వెలుగు: నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్​లో టీఆర్ఎస్ లీడర్ల మధ్య వివాదం ముదురుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదివారం చర్చకు సై అంటే సై అంటున్నారు. ఆదివారం అంబేద్కర్​చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పది రోజుల కింద సవాల్ విసిరారు. జూపల్లి సవాల్​కు సై అన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తాకు ఎందుకు మీ ఇంటికే వస్తా అని చాలెంజ్ చేశారు. 18న కొల్లాపూర్​లో మంత్రి కేటీఆర్​పర్యటించారు. ఆ సమయంలో జూపల్లి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. దీంతో వివాదం సద్దుమణుగుతుందని భావించారు. కానీ సవాల్​కు కట్టుబడి ఉన్నామని ఇద్దరు లీడర్లు, వారి ప్రధాన అనుచరులు సోషల్​మీడియా వేదికగా సవాళ్లు విసురుకుంటుండడంతో కొల్లాపూర్​లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. అంబేద్కర్ చౌరస్తా, జూపల్లి ఇంటివరకు ర్యాలీలు, మైక్ పర్మిషన్  ఇచ్చేది  లేదని పోలీసులు అంటున్నారు. ఆదివారం కొల్లాపూర్​లో  నిషేధాజ్ఞలు విధించారు. శనివారమే భారీగా బలగాలను దించారు. బీరం హర్షవర్ధన్​రెడ్డి శనివారం కొల్లాపూర్​కు చేరుకున్నారు. జూపల్లి రాత్రి వరకు వస్తారని సమాచారం. 

జూపల్లి ఇంటికే వెళ్తా: బీరం

జూపల్లి ఇంటికే వెళ్తానని, అక్కడే అన్ని ఆధారాలతో మాట్లాడుతానని హర్షవర్ధన్​రెడ్డి  చెప్పారు. శనివారం హైదరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం సంతరోజు ప్రజలకు ఇబ్బంది ఎందుకని జూపల్లి ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్​కోసం అప్లై చేశామన్నారు. బరాబర్ ఆయన ఇంటికి వెళ్తామని చెప్పారు. ప్రతిపక్షాల కంటే వీళ్ల రాజకీయమే ఎక్కువైందని మండిపడ్డారు. 

ఆధారాలతో చౌరస్తాకు వస్తా: జూపల్లి

ఎన్నికల తర్వాత మూడున్నర ఏండ్లు సైలెంట్​గా ఉన్నా. ఓట్లేయలేదని పథకాలు ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నారు. కల్యాణలక్ష్మి అప్లికేషన్లు రిటర్న్ చేయడం,పెండింగ్​లో పెట్టి నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కుడికిళ్ల రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో వివక్ష చూపించారని ఆరోపించారు. తాను ఎవరి మీదా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని, కానీ ఉమ్మెస్తే తుడుచుకుని పోయేరకం కాదన్నారు. చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా అన్నారు.