టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం

టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం

వరంగల్‍, జనగామ, స్టేషన్ ఘన్‌‌పూర్, వెలుగు : ‘‘స్టేషన్‍ ఘన్‍పూర్‍ నియోజకవర్గం నా అడ్డా.. నేను పుట్టిందీ, పెరిగిందీ, చదివిందీ, డాక్టర్‍ ప్రాక్టీస్‍ చేసిందీ ఇక్కడే. మా ఓట్లన్నీ ఇక్కడే ఉన్నయ్. కడియం శ్రీహరి నాన్‍లోకల్‍. అతనికి, అతని ఫ్యామిలీకి ఇక్కడ కనీసం ఓటు కూడా లేదు’’ అని రాజయ్య అన్నారు. మంగళవారం హనుమకొండలో ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. కడియం తనను తాను నీతిపరుడిగా చెప్పుకుంటారని, కానీ ఆయన అవినీతి దళితదొర అని విమర్శించారు. 1994కు ముందు ఆయనకున్న ఆస్తులు.. ప్రస్తుత ఆస్తుల వివరాలు చూస్తే ఆయన అవినీతి తెలిసిపోతుందన్నారు. ఇండ్లు, భూములు, పెట్రోల్ బంకులు ఎలా వచ్చాయో, సిటీలో బిల్డింగ్‍ ఏ కాంట్రాక్టర్‍ కట్టించాడో చెప్పాలన్నారు. కడియం అవినీతి బాగోతం మొత్తం తెలుసని, అవసరం వచ్చినప్పుడు బయట పెడతానన్నారు. ఎమ్మెల్సీ ఫండ్స్ ​ఇస్తున్న శ్రీహరి.. ప్రభుత్వ ప్రచారం వద్దంటూ ఇన్‍డైరెక్ట్​గా ప్రతిపక్షాలకు అనుకూలంగా పని చేస్తున్నాడన్నారు. ‘‘కడియం16 ఏండ్లు కాకిలెక్క మంత్రిగా పనిచేసినా చేయలేనిది.. నేను  కోకిల లాగా పని చేసి ఆరేండ్లలోనే కాళోజీ హెల్త్​యూనివర్సిటీ తీసుకువచ్చా. సొంత పార్టీలో ఉన్న నన్ను ఓడించేందుకు కడియం పనిచేశాడు” అని ఆరోపించారు. గ్రామాల్లో తిరిగినప్పుడు మహిళలతో కలిసి కోలాటమాడితే చిలిపి పనులంటూ బద్నాం చేస్తున్నారని అన్నారు. ‘‘స్టేషన్‍ ఘన్‍పూర్‍ నియోజకవర్గంలో నా చుట్టాలు, తెలిసినవాళ్లు చాలామంది ఉన్నారు. వారికి దళితబంధు ఇస్తున్నం. భూమిలేని పేదలకే దళితబంధు ఇయ్యాలని, చుట్టాలకు ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‍ ఎక్కడా చెప్పలేదు. హుజూరాబాద్‍లో ఉద్యోగులకు కూడా ఇచ్చారు. ఘన్‍పూర్‍లోనూ అదే ఫాలో అవుతున్నాం” అని చెప్పుకొచ్చారు.

మతిభ్రమించినట్లు మాట్లాడొద్దు: కడియం
చిన్న పెండ్యాలలో సోమవారం తనపై ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్లపై కడియం శ్రీహరి సీరియస్​ అయ్యారు. మాజీ మార్కెట్ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో మంగళవారం మీడియాతో కడియం మాట్లాడారు. సొంతపార్టీకి చెందిన రాజయ్య తనను టార్గెట్ చేస్తూ మాట్లాడడం సరికాదని, తనతో ఏదన్నా సమస్య ఉంటే హైకమాండ్‍ దగ్గర చెప్పుకోవాలని, మతిభ్రమించినట్లు మాట్లాడొద్దని సూచించారు. రాజయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్​ఆదేశాల మేరకు 2014, 2018 ఎన్నికల్లో రాజయ్య గెలుపు కోసం పనిచేశామని, మాట్లాడితే ‘స్టేషన్ ఘన్‌‌పూర్ నా అడ్డా, నా జాగీర్’ అనడం సరికాదన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. తాను గాలివాటం నాయకుడిని కాదని చెప్పారు. ‘‘దళితబంధు లబ్ధిదారులు దావత్‌‌లు ఎందుకివ్వాలి. కేసీఆర్ అవినీతిని సహించరు. అర్హత ఆధారంగా దళితబంధు వస్తుంది’’ అని అన్నారు. చిల్లర పనులు, చిలిపి చేష్టలు చేస్తూ, మద్యం తాగి మీటింగులకు వెళ్తే ప్రజలు అసహ్యించుకోక గౌరవం ఇస్తారా అని ప్రశ్నించారు. ‘‘నీ వ్యవహారాలన్నీ రికార్డులతో సహా ఉన్నాయి. వాటిని బయటపెడితే నీవు గ్రామాల్లో తిరగలేవు’’ అని హెచ్చరించారు. ‘‘నీకిష్టమైన స్వచ్ఛంద సంస్థతో సర్వే చేయిద్దాం. ఖర్చంతా నాదే. ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో తేల్చుకుందాం. ఒక వేళ సర్వేకు ముందుకు రాకుంటే ఇకపై ఎక్కడా నా ప్రస్తావన తేవద్దు. ఇదే ఫైనల్ వార్నింగ్’’ అని స్పష్టం చేశారు.