బీజేపీలో చేరమన్నారు.. రానని చెప్పాను : ఎమ్మెల్సీ కవిత

బీజేపీలో చేరమన్నారు.. రానని చెప్పాను : ఎమ్మెల్సీ కవిత

బీజేపీలో చేరాలంటూ తనకు చాలా ప్రపోజల్స్ వచ్చాయని.. అయితే తాను రానని స్పష్టం చేశానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, సైద్ధాంతిక సంస్థల నుంచి తనకు ఈమేరకు ఆహ్వానాలు అందాయన్నారు. తెలంగాణలోనూ షిండే మోడల్ లో తిరుగుబాటు చేయాలని తనకు చెప్పారని వివరించారు. వాటన్నింటిని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని కవిత స్పష్టం చేశారు. ‘‘నేను ఏ పార్టీలోనూ చేరను.. మా పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. దాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ప్రజలు సహకరిస్తే వాళ్ల కోసం పనిచేస్తం’’ అని వివరించారు. 

‘‘ నేను కాంగ్రెస్ తో టచ్  లో ఉన్ననని కాంగ్రెస్ సెక్రటరీ చెప్పాడంట.. మరి అరవింద్ ఎందుకు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నట్టు ? ’’ అని కవిత ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తో అందరికీ ఫ్రెండ్ షిప్ ఉంటది..అందరూ మాట్లాడుతరు’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ అర్వింద్ లైన్ దాటి మాట్లాడితే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ మద్దతు తీసుకొని.. అనుకోకుండా అర్వింద్ ఎంపీ అయ్యారని చెప్పారు.

అర్వింద్ మాట్లాడే భాష వల్ల నిజామాబాద్ పరువు పోతోందన్నారు.  పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీ లు యావరేజ్ గా 20 డిబేట్లలో పాల్గొంటే.. ఎంపీ అర్వింద్ కేవలం 5 చర్చల్లోనే పాల్గొన్నారని తెలిపారు. పార్లమెంట్ లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క అంశంపై అర్వింద్ గొంతెత్తి మాట్లాడలేదని మండిపడ్డారు. ఫేక్ సర్టిఫికెట్ తో రాజస్థాన్ లోని ఒక యూనివర్సిటీలో అర్వింద్ చదువుకొని వచ్చారని.. దీనిపై ఎన్నికల కమిషన్ లో ఫిర్యాదు చేస్తానన్నారు. ఇంకోసారి తాను అర్వింద్ పై ప్రెస్ మీట్ పెట్టనని కవిత తేల్చి చెప్పారు.