ప్రభుత్వ ఆఫీసుల్లో పార్టీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లు

ప్రభుత్వ ఆఫీసుల్లో పార్టీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లు
  • ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు
  • చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఆఫీసర్లు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న  ప్రతిపక్షాలు

గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ లీడర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసులు, రైతు వేదికలను పార్టీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లకు వాడుకుంటున్నారు. గతంలోనే రైతువేదికల్లో మీటింగ్‌‌‌‌‌‌‌‌లు పెట్టగా ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. అయినా మారని నేతలు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఆఫీసుల్లోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ చేపట్టనున్న విజయగర్జనకు సభకు సంబంధించిన సన్నాహాక సమావేశాలను ఆయా మండలాల్లోని రైతువేదికలతో పాటు గద్వాల జడ్పీ మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించడం చర్చనీయాంశమైంది.  ఇదంతా తెలిసినా ఆఫీసర్లు చూసీచూడనట్లు వదిలేస్తుండడంపై ప్రతిపక్ష లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రైతుల కోసమా? పార్టీ కోసమా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జోగులాంబ గద్వాల జిల్లాలో 94 రైతు వేదికలను నిర్మించారు. వీటిల్లో రైతులతో మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టి వారి  సాధకబాధకాలు తెలుసుకోవాలని ప్రభుత్వం గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది.  భూముల స్వభావాన్ని బట్టి ఏ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఏ పంట సాగు చేయాలి..?   ఏ పంటకు డిమాండ్ బాగా ఉంటుంది..? కొత్త పద్ధతులు, కొత్త వంగడాలు ఏంటి..? మార్కెటింగ్ ఎలా..? తదితర అంశాలపై అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు అవగాహన కల్పించాలని సూచించింది. కానీ వ్యవహారం ఇందుకు భిన్నంగా నడుస్తోంది.  ఇప్పటివరకు ఒక్క వేదికలో కూడా రైతుల కోసం మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టలేదు.  టీఆర్ఎస్ పార్టీ సమావేశాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.  విజయగర్జన సభ కోసం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మల్దకల్, కేటి దొడ్డి మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో ముఖ్య టీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టారు.  వీటితో పాటు ఇటీవల గద్వాల జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో, జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌లో  పార్టీ సమావేశం జరిపారు. 

ఆఫీసర్లు సైలెంట్
వాస్తవానికి రైతు వేదికలు అగ్రికల్చర్ ఆఫీసర్ల ఆధీనంలో ఉండాలి.  కానీ, తాళాలు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల చేతిలో ఉంటున్నాయి.  ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు వేదికలను ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసి పార్టీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లు పెడుతున్నారు. అన్నీ తెలిసినా ఆఫీసర్లు చప్పుడు చేయడం లేదు.  ఎమ్మెల్యేల ఒత్తిడితోనే సైలెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది.  గతంలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన సందర్భంగా కూడా ఇలాగే మీటింగ్‌‌‌‌‌‌‌‌లు పెట్టారు. దీనిపై అప్పట్లో దుమారం రేగగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. కానీ, షరామామూలే అయిపోయింది.

ఎంక్వైరీ చేస్తం
రైతు వేదికలు, ఎంపీడీవో మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌లో  టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిన విషయంపై ఎంక్వైరీ చేస్తం.  రైతు వేదికల్లో రైతుల కోసం మాత్రమే సమావేశాలు నిర్వహించాలి.  ఇలాంటివి రిపీట్ కాకుండా  చర్యలు తీసుకుంటం.
- శ్రీహర్ష,  అడిషనల్ కలెక్టర్,  గద్వాల 

ప్రతిపక్షాల ఫైర్
అధికార పార్టీ నేతల తీరుపై బీజేపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రైతుల కోసం కట్టిన రైతు వేదికలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లు ఏంటని  రైతు సంఘాల లీడర్లు రామి రెడ్డి, ఎగ్బల్ భాష మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తీరు మార్చుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.