
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ఆమోదం పొందడంతో ఇక కేంద్రంపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టబోతోంది. రెండ్రోజుల గ్యాప్ తర్వాత సోమవారం నుంచి సమావేశాలు స్టార్టవనుండటంతో కేంద్రంపై ఎదురుదాడికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెడీ అవుతున్నారు. కరోనా నివారణ విషయంలో కేంద్రం సహాయం, జీఎస్టీ పరిహారం, సెక్రటేరియెట్ నిర్మాణం, నేషనల్ హైవేల మరమ్మతులు, నీటి పారుదల ప్రాజెక్టులకు కేంద్రం నిధులివ్వకపోవడాన్ని ఫోకస్ చేయనున్నారు.
జీఎస్టీపై ఫోకస్
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు కరోనా రావడంతో సమావేశాలకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రాలేదు. తాజాగా శనివారం నెగెటివ్ రావడంతో త్వరలో అసెంబ్లీకి హాజరుకానున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం అనుసరిస్తున్న తీరును అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా ఆయన ఎండగట్టనున్నట్టు తెలిసింది.
కరోనా సాయంపై..
రాష్ట్రంలో కొవిడ్ నివారణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. నిధులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు ఇచ్చినా వాడుకోవట్లేదని చెబుతున్నారు. తాజాగా ‘కేసీఆర్ ఖాతాలో వేస్తేనే నిధులిచ్చినట్టా’ అని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. వీటన్నింటిపై సీఎం ఎటాక్ చేయనున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి కేంద్రం ఇచ్చిన నిధులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల లెక్కలను సభలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.
నేషనల్ హైవేలపై వివక్ష
ఇటీవలి వర్షాలకు నేషనల్, స్టేట్ హైవేస్ బాగా దెబ్బతిన్నాయని ఆర్&బీ ప్రకటించింది. నేషనల్ హైవేల మరమ్మతులకు నిధులివ్వాలని ఎన్‌హెచ్ఏఐకి, కేంద్ర రవాణా శాఖకు లేఖ రాశామని, అయినా విడుదల చేయలేదని రోడ్లు భవనాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చెప్పారు. స్టేట్ హైవేస్ దెబ్బతిన్నా తాత్కాలిక మరమ్మతులు చేశామన్నారు. అయితే ఇంత తక్కువ టైమ్‌లో స్టేట్ హైవేస్ మరమ్మతులు అసాధ్యమని, రాష్ట్ర సర్కారు గొప్పలు చెబుతోందని ఎన్‌హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేలతో ప్రశ్నలు అడిగిస్తూ..
ఇటీవల అసెంబ్లీలో ఆసరా పెన్షన్లపై ప్రశ్న వచ్చినప్పుడు కేంద్రం పెన్షన్లకు ఎంత ఇస్తుందో అడగాలని ఓ ఎమ్మెల్యేకు ఓ మంత్రి చెప్పారు. ఆ ప్రశ్నకు మంత్రి తక్కువ సమాధానం చెప్పి రాష్ట్రం చేస్తున్న ఖర్చులో 2 శాతం కూడా కేంద్రం ఇవ్వటం లేదని చాలా సేపు కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. రానున్న రోజుల్లోనూ ఎమ్మెల్యేల చేత ప్రశ్నలు అడిగించి విమర్శలు చేస్తారని పలువురు చెబుతున్నారు.
యూరియా కేటాయింపులపైఅటాక్
రాష్ట్రానికి యూరియా కేటాయింపులో కేంద్రం వివక్ష చూపిస్తోందని ప్రభుత్వం విమర్శిస్తోంది. ఇటీవల కేంద్ర ఫర్టిలైజర్స్ మంత్రి సదానందగౌడను కలిసిన కిషన్‌రెడ్డి.. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పలు సార్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లారు. ఈ అంశం మరో సారి అసెంబ్లీ ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.