- సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట బైఠాయింపు
- బడ్జెట్లో అన్యాయం చేస్తే బీజేపీ లీడర్లను తిరగనియ్యం: వినోద్ కుమార్
- ఆందోళనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం
సికింద్రాబాద్, వెలుగు: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి’ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట టీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసేందుకు అనుమతించకపోవడంతో నిరసనకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇటు మెట్టుగూడ, అటు సంగీత్ చౌరస్తా వైపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ పార్టీలతో పాటు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు, ప్రజాసంఘాల నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారని ఆయన అన్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రులు వస్తే వారికే ప్రాజెక్టులు పోతున్నాయని దుయ్యబట్టారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ, నిధులు ఇచ్చినా.. బీజేపీ నేతలు ఈ విషయంలో అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు సరైన బడ్జెట్ కేటాయింపులు చేయాలని, అన్యాయం జరిగితే బీజేపీ నేతలను రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. విభజన చట్టంలోని ప్రతి హామీని నెరవేర్చే వరకు బీజేపీ ప్రభుత్వాన్ని వదలిపెట్టేది లేదన్నారు. తర్వాత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ అగర్వాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం లీడర్లు కూడా మద్దతు తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం మోసం చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ తో కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రయోజనాల కోసం అఖిలపక్షం పిలుపులో భాగంగానే రైల్ నిలయం ముట్టడి కోసం వచ్చామని చెప్పారు.
తిట్టుకున్న ఇద్దరు డీసీపీలు
రైల్ నిలయం వద్ద ధర్నా బందోబస్తును పర్యవేక్షించేందుకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారుల్లో ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు. ధర్నా అనంతరం రైల్వే జీఎంను కలిసేందుకు వెళ్లిన లీడర్ల పేర్ల లిస్టు ఇవ్వాలని నార్త్‌జోన్ డీసీపీ స్థానిక ఇన్స్పెక్టర్ను కోరారు. తాను పేర్లు నమోదు చేయలేదని ఇన్స్పెక్టర్ చెప్పడంతో నార్త్ జోన్ డీసీపీ ఆగ్రహానికి గురై.. తిట్టడం మొదలుపెట్టారు. ‘‘ఇవన్నీ మేము దగ్గరుండి చేయాల్నా? మిమ్మల్ని పర్యవేక్షిస్తున్న డీసీపీ ఏం చేస్తున్నడు” అంటూ ఆయన నిలదీయడంతో కొద్ది దూరంలోనే ఉన్న సిటీ స్పెషల్వింగ్ డీసీపీ అందుకున్నారు. నార్త్‌జోన్ డీసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా.. ‘‘నువ్వెంత అంటే నువ్వెంత’’ అంటూ ఇద్దరు డీసీపీలు ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. సబార్డినేట్స్ ముందే ఇలా ఇద్దరు డీసీపీలు తిట్టుకోవడంతో అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
