
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ సినిమాలపై ట్రంప్ వంద శాతం సుంకం విధించారు. అమెరికాలో తెరకెక్కించే సినిమాలకు మాత్రమే ఈ వంద శాతం సుంకం నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం.. అమెరికాలో విడుదలయ్యే భారతీయ సినిమాలపై.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపై భారీ ప్రభావం చూపనుంది. టాలీవుడ్లో ఒక పెద్ద సినిమా విడుదలై ఘన విజయం సాధిస్తే.. దాదాపు 25 శాతం ఆదాయం USA నుంచే వస్తుంది.
అమెరికాలో ఆ స్థాయిలో తెలుగు జనం ఉన్నారు. బాహుబలి2, RRR, కల్కి 2898 AD సినిమాల ఆదాయంలో పావు వంతు అమెరికాలో ఆ సినిమాలను పెద్ద ఎత్తున విడుదల చేయడం వల్లే వచ్చింది. హాలీవుడ్ సినిమాలకు మేలు చేసే ఉద్దేశంతో ట్రంప్ తీసుకున్న 100 శాతం సుంకాల నిర్ణయంతో తెలుగు సినిమాల నెత్తిన పెద్ద పిడుగు పడింది.
2024లో అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాలు సుమారు 160 మిలియన్ డాలర్ల నుంచి 170 మిలియన్ డాలర్ల మధ్యన కలెక్షన్స్ రాబట్టాయి. విదేశీ సినిమాలపై ట్రంప్ తీసుకున్న 100 శాతం సుంకాల నిర్ణయంతో అమెరికాలో భారతీయ సినిమాలు సాధించే రెవెన్యూ అమాంతం పడిపోనుంది.
ALSO READ : ఇక Movierulzకు మూడింది.. ఈ పైరసీ వెబ్సైట్కు.. డబ్బులు ఎలా వస్తున్నాయో తేల్చిన పోలీసులు
ముందు.. ముందు చాలా పెద్ద సినిమాలు టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలకృష్ణ అఖండ2, రవితేజ మాస్ జాతర, వచ్చే సంక్రాంతికి ‘రాజా సాబ్’, అనిల్ రావిపూడి, చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఇలా చాలా పెద్ద సినిమాల కలెక్షన్లపై ట్రంప్ తాజా నిర్ణయం భారీ ప్రభావం చూపనుందనడంలో సందేహం లేదు.