ట్రంప్, పుతిన్ భేటీ సక్సెస్.. కుదరని డీల్! రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై నిర్ణయం జెలెన్ స్కీ చేతిలోనే ఉందన్న ట్రంప్

ట్రంప్, పుతిన్ భేటీ సక్సెస్.. కుదరని డీల్! రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై నిర్ణయం జెలెన్ స్కీ చేతిలోనే ఉందన్న ట్రంప్
  • అలస్కాలో ట్రంప్, పుతిన్ చర్చలు
  • చర్చలు బాగా జరిగాయని ఇరువురి నేతల ప్రకటన 
  • యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నామన్న రష్యా అధ్యక్షుడు 
  • ఇక నిర్ణయం జెలెన్ స్కీ చేతిలోనే ఉందన్న యూఎస్ ప్రెసిడెంట్ 
  • ఇండియాపై సెకండ్ టారిఫ్​లు ఉండకపోవచ్చని వెల్లడి 
  • రేపు వైట్​హౌస్​లో ట్రంప్​ను కలవనున్న జెలెన్ స్కీ

యాంకరజ్(అలాస్కా): రష్యా, ఉక్రెయిన్ వార్​కు ముగింపు పలికే దిశగా ముందడుగు పడిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్​తో శాంతి ఒప్పందంపై చర్చించడం కోసం అమెరికాలోని అలస్కా స్టేట్ ఎల్మండార్ఫ్ ఎయిర్ బేస్​లో శుక్రవారం మధ్యాహ్నం (యూఎస్​ టైమ్​) ఇరువురు నేతలు భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత వారు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇద్దరి మధ్య చర్చలు చాలా బాగా జరిగాయని ట్రంప్ చెప్పారు. అయితే, రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయం మాత్రం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ చేతుల్లోనే ఉందన్నారు.

ఉక్రెయిన్​తో యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ వెల్లడించారు. తదుపరి దశ చర్చల కోసం మాస్కోకు రావాలని ఆయన ఆహ్వానించగా.. బహుశా, తదుపరి భేటీ అక్కడే జరగొచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్.. పుతిన్ వెంట రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, జాతీయ భద్రతా సలహాదారు యూరి ఉషకోవ్ భేటీలో పాల్గొన్నారు. అయితే, 15 నిమిషాలపాటు సాగిన మీడియా సమావేశంలో రిపోర్టర్ల ప్రశ్నలకు ఇరువురు నేతలు సమాధానాలు ఇవ్వలేదు. చర్చల ఫలితాలపై కూడా స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు.

శాంతి స్థాపనకు మార్గం సుగమం: పుతిన్ 
అమెరికా, రష్యా మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని, రెండో ప్రపంచ యుద్ధంలో రెండు దేశాలు కలిసి పని చేశాయని పుతిన్ చెప్పారు. ట్రంప్​తో భేటీ తర్వాత మీడియా సమావేశంలో ముందుగా ఆయన మాట్లాడుతూ.. చర్చలు నిర్మాణాత్మకంగా, పరస్పరం గౌరవప్రదంగా సాగాయన్నారు. ఈ చర్చల్లో కొన్ని అంశాలపై అంగీకారానికి వచ్చామని, ఇవి ఉక్రెయిన్ లో శాంతికి మార్గం సుగమం చేస్తాయన్నారు. ఉక్రెయిన్, యూరోపియన్ దేశాలు కూడా ఎలాంటి అడ్డంకులను సృష్టించకుండా శాంతి దిశగా కృషి చేయాలన్నారు.

ఉక్రెయిన్​లో జరుగుతున్న పరిణామాలతో రష్యా జాతీయ భద్రతకు ముప్పు ఉన్నందునే తాము కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం యూరప్​తోపాటు ప్రపంచంలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే 2020 అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే ఉక్రెయిన్​పై రష్యా దండెత్తి ఉండేదే కాదన్న ట్రంప్ కామెంట్లపై పుతిన్ స్పందిస్తూ.. తాను కూడా దానిని అంగీకరిస్తున్నానని చెప్పారు. ట్రంప్​తో భేటీపై పుతిన్ శనివారం మాస్కోలో కూడా మాట్లాడారు. ‘‘ట్రంప్​తో చర్చలు ఓపెన్​గా జరిగాయి. శాంతి ఒప్పందం దిశగా నిర్ణయాలకు చేరువయ్యాం. సమయానికి తగ్గట్టుగా, చాలా ఉపయోగకరంగా చర్చలు జరిగాయి. ఈ స్థాయిలో నేరుగా చర్చలు జరగడం ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడలేదు” అని వెల్లడించారు. 

అన్నీ కుదిరితే పుతిన్​తో మళ్లీ భేటీ: ట్రంప్ 
పుతిన్​తో చర్చలు చాలా బాగా జరిగాయని, చాలా అంశాల్లో అంగీకారానికి వచ్చామని ట్రంప్ వెల్లడించారు. తాము కొన్ని అంశాలపై మాత్రమే చర్చించలేదని, ఇంకా శాంతి ఒప్పందం వరకూ చేరుకోలేదన్నారు. కానీ శాంతి ఒప్పందం దిశగా మంచి అవకాశాన్ని ఏర్పర్చామన్నారు. ‘‘కాల్పుల విరమణకు కాకుండా నేరుగా శాంతి ఒప్పందం కోసమే మేం ప్రయత్నించాం. ఎందుకంటే కాల్పుల విరమణ చేసుకుంటే అది ఎక్కువకాలం నిలవదు. అయితే, మేం శాంతి ఒప్పందం వరకూ చేరుకోలే. తదుపరి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, నాటో లీడర్లే” అని ట్రంప్ చెప్పారు. 

యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్, తాను గణనీయమైన పురోగతిని మాత్రం సాధించామన్నారు. పుతిన్ తో చర్చలు బాగా సాగాయని, ఈ సమావేశానికి తాను 10కి 10 మార్కులు వేస్తున్నానని ట్రంప్ చెప్పారు. అయితే, ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలపై అంగీకారానికి వచ్చారన్న వివరాలను వెల్లడించలేదు. పుతిన్​తో భేటీ తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, నాటో లీడర్లతో ఫోన్లో మాట్లాడానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. జెలెన్ స్కీతో చర్చించాక, అన్నీ సరిగ్గా కుదిరితే పుతిన్​తో మీటింగ్ ను ఖరారు చేస్తామన్నారు.