
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , డెమోక్రాట్ నేత …స్పీకర్ నాన్సీ పెలోసీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రసంగానికి ముందు స్పీకర్ నాన్సీకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ట్రంప్. తన దగ్గర ఉన్న ప్రసంగ కాపీలను స్పీకర్ నాన్సీకి ఇచ్చారు ట్రంప్. స్పీచ్ పేపర్లను తీసుకున్న నాన్సీ.. ట్రంప్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ట్రంప్ మాత్రం ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మైక్ వైపు తిరిగారు. దీంతో ట్రంప్ మాట్లాడుతున్నంత సేపు.. నాన్సీ తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేస్తూ ఉండిపోయారు. ట్రంప్ ప్రసంగాన్ని ముగించగానే.. తన చేతిలో ఉన్న ప్రసంగ పేపర్లను రెండు ముక్కలు చేసి నిరసన వ్యక్తం చేశారు స్పీకర్ నాన్సీ . తర్వాత తన చర్యను ఆమె సమర్థించుకున్నారు. ట్రంప్ చేసింది చెత్త స్పీచ్ అన్నారు నాన్సీ.
అమెరికా ఆర్థిక వ్యవస్థను వేగంగా బలోపేతం చేశామన్నారు డొనాల్డ్ ట్రంప్. ఉద్యోగాలకు కోత విధించే అనేక ఆంక్షలను ఎత్తివేసినట్లు చెప్పారు. గత మూడేళ్లలో 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. మూడేళ్ల పాలనను వివరించారు. దేశ మిలిటరీని పునర్ నిర్మించామన్నారు ట్రంప్. సైన్యం కోసం అత్యధిక స్థాయిలో 2.2 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అమెరికా ఉద్యోగాలను కాజేస్తున్న చైనాపై నియంత్రణ తీసుకువచ్చినట్లు చెప్పారు. హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థను స్థాపించిన అల్ బగ్దాదిని హతమార్చినట్లు ట్రంప్ తెలిపారు.