
‘‘ఇండియా ఇంతకుముందులా లేదిప్పుడు. గొప్ప స్పిరిట్‌తో మోడీ ఒక తండ్రిలా ప్రజల్ని ఏకం చేశారు. వాళ్ల మద్దతుతో రెండోసారి కూడా ఆయన ఘనవిజయం సాధించారు. అందుకే మోడీని ‘ఫాదర్ ఆఫ్ ఇండియా’గా భావిస్తాను. పర్సనల్‌గా మా ఇద్దరి మధ్య గొప్ప కెమిస్ట్రీ ఉంది. పాప్ కింగ్ ఎల్వీస్ ప్రెస్లీ మాదిరిగా మోడీ కూడా రాక్‌స్టార్‌లా అనిపిస్తారు”అంటూ ప్రధానిపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం న్యూయార్క్‌లో ఉన్న ఇద్దరు నేతలు మంగళవారం ద్వైపాక్షిక చర్చలు చేశారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ కామెంట్లు చేశారు. రెండు దేశాల ఎకానమీకి బూస్ట్ ఇచ్చేలా ట్రేడ్‌పై త్వరలోనే మంచి డీల్ కుదుర్చుకుంటామని వెల్లడించారు.
పాక్‌కు మోడీ వార్నింగ్ చాలదా!
మోడీతో భేటీ తర్వాత ట్రంప్ ఇండియన్ మీడియాతో మాట్లాడారు. ఇస్లామిక్ టెర్రరిజంపై ఇండియాతో కలిసి పోరాడుతామన్న అమెరికా.. పాకిస్తాన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటోందని, అల్‌కాయిదాకు ట్రైనింగ్ ఇచ్చింది మేమేనని పాక్ పీఎం ఇమ్రాన్ స్వయంగా ఒప్పుకున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని రిపోర్టర్లు ట్రంప్‌ను నిలదీశారు. దీనికి సమాధానంగా ట్రంప్.. ‘‘పాక్ సంగతి మోడీ చూసుకుంటారు. ఇప్పటికే ఆయనిచ్చిన వార్నింగ్ సరిపోతుందేమో. టెర్రరిజాన్ని ఎలా ఎదుర్కోవాలో మీ ప్రధానికి బాగా తెలుసు. అమెరికాకు పాక్ కంటే ఇరానే పెద్ద శత్రువు’’అని స్పష్టం చేశారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు మీడియేషన్‌పై మాట్లాడుతూ పాక్ కోరినందుకే కాశ్మీర్ విషయంలో మీడియేషన్‌కు రెడీ అయ్యానని, ఒకవేళ ఇండియా కూడా ఒప్పుకుంటేనే ముందడుగు వేస్తానని అన్నారు. ట్రంప్ కామెంట్లపై విదేశాంగ శాఖ స్పందిస్తూ, కాశ్మీర్‌పై థర్డ్ పార్టీ జోక్యాన్ని సహించబోమని క్లారిటీ ఇచ్చింది.
ట్రంప్ మన బెస్ట్ ఫ్రెండ్: మోడీ
పర్సనల్‌గానే కాకుండా ఇండియాకు కూడా ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్‌లా వ్యవహరిస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. రెండో సారి గెలిచిన తర్వాత నాలుగు నెలల్లోనే అమెరికా ప్రెసిడెంట్‌తో మూడు సార్లు భేటీ అయి చాలా విషయాలపై చర్చలు జరిపానని గుర్తుచేశారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు ఇలా తరచూ ఎంగేజ్ కావడం, అన్ని రంగాలపై మాట్లాడుకోవడం ప్రపంచానికి మంచి సంకేతమని మోడీ అన్నారు. దోస్తీ ఈ మధ్య మరింత బలపడిందని, రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగంలో అమెరికా పెట్టుబడుల వల్ల ఇండియాలో కొత్తగా 50వేల కొత్త ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు.
నేషనలిజమే ముద్దు
గ్లోబలైజేషన్‌కు కాలం చెల్లిందని, ప్రపంచ దేశాలు వేటికవే జాతీయవాద స్ఫూర్తితో ముందుకెళ్లాలని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. మంగళవారం యునైటెడ్ నేషన్స్ 74వ జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. వరల్డ్ ఆర్గనైజేషన్లు, కూటములుగా ఏర్పడేకంటే ఎవరికివారు వన్–టు–వన్ ఒప్పందాలు చేసుకోవడం మేలన్నారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై దాడిచేసి ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, ఆ దేశాన్ని కట్టడిచేసేందుకు మిగతా దేశాలు సహకరించాలని కోరారు. ‘‘ఫ్యూచర్ దేశభక్తులదేకానీ గ్లోబలిస్టులది కాదు. ఏ దేశానికైనా సావర్నిటీ, బోర్డర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం. వలసల వల్ల అవిరెండూ ప్రమాదంలో పడతాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో)లో చైనా చేరిన తర్వాత(2001 తర్వాత) అమెరికాలో 60వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి. డబ్ల్యూటీవో రూల్స్‌ని వెంటనే మార్చేయాలి. సోషలిజం ఓ పీడకల. పాలక వర్గాలకు తప్ప ప్రజలకు మేలు జరగదు. వెనెజులాకు పట్టిన దుర్గతి అందుకో ఉదాహరణ’’ అని ట్రంప్ చెప్పారు.