
వేలాది మంది ఇండియన్లకు లాభం చేసిపెట్టే కొత్త వలస విధానాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్రీకారం చుట్టారు. ప్రతిభ, పాయింట్ల ఆధారంగా గ్రీన్కార్డులిచ్చేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అందులో భాగంగా గ్రీన్‌కార్డ్ అనే కాన్సెప్ట్‌ను ఎత్తేసి దాని ప్లేస్‌లో ‘బిల్డ్ అమెరికా వీసా’గా కొత్త వలస విధానానికి తెరదీశారు. ప్రస్తుతం ప్రతిభ ఆధారంగా ఇస్తున్న గ్రీన్‌కార్డులను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచారు. అంతేకాదు, కొత్తగా అమెరికా వెళ్లాలనుకునేవాళ్లు ఇంగ్లిష్ బాగా మాట్లాడాలి. అలా అయితేనే అవకాశం కల్పిస్తారు. అమెరికా సమగ్రత, ఐక్యత తెలిసేలా సివిక్స్ (పౌరశాస్త్రం) పరీక్ష పెడతారు. గురువారం ఈ సరికొత్త వలస విధాన వ్యవస్థపై ట్రంప్ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన వలస విధానాలు ‘విచ్ఛిన్నం’ అయ్యాయని ట్రంప్ అన్నారు. దాని వల్ల ప్రపంచంలోని చురుకైన, తెలివైన వారికి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నామన్నారు. ప్రతిభ, వయసు, తెలివి, ఉద్యోగ అవకాశాలు, పౌరశాస్త్రంలో జ్ఞానం, ఇంగ్లిష్ నైపుణ్యాలపై పాయింట్ల ప్రాతిపదికన శాశ్వత నివాస హోదా ఇస్తామని చెప్పారు. ‘‘ఇప్పటిదాకా తెలివైన, చురుకైన వారి విషయంలో వివక్ష చూపించాం. ఇకపై అలా జరగదు. నేను పెట్టిన ప్రతిపాదనలపై ఆమోదం పడగానే న్యాయం జరుగుతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రతిపాదనలను పాస్ చేయించుకుంటాం. మెరికల్లాంటి విద్యార్థులు, ఉద్యోగులు మాకు కావాలి. అమెరికాలో ఉంటూ వారి జ్ఞానాన్ని పంచాలి” అని ట్రంప్ అన్నారు.
బుద్ధిలేని విధానాలవి
ఇప్పుడున్న బుద్ధిలేని విధానాల వల్ల ఓ డాక్టర్‌కు, ఓ సైంటిస్టుకు, ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా ఓ నంబర్ వన్ స్టూడెంట్‌కు మెరుగైన అవకాశాలు కల్పించలేకపోతున్నామని ట్రంప్ విమర్శించారు. ఇప్పటిదాకా నైపుణ్యాలు లేని, తక్కువ జీతం ఉన్న వారికి మాత్రమే గ్రీన్ కార్డులిచ్చి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దీంతో కొత్త వాళ్లొచ్చి అమెరికన్ల పొట్టకొడుతున్నారని, దాని వల్ల సామాజిక భద్రత ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలనూ సరిగ్గా అమలు చేయలేకపోతున్నామన్నారు. ఏటా 11 లక్షల గ్రీన్కార్డులిస్తుంటే, అందులో 66 శాతం గ్రీన్‌కార్డులను కేవలం కుటుంబం ప్రాతిపదికనే ఇస్తున్నామన్నారు. ప్రతిభ ఉన్న వారికి ఇస్తున్నది కేవలం 12 శాతమన్నారు. దానినే తాము మార్చాలనుకుంటున్నామని, ఇకపై ప్రతిభ ఉన్న వాళ్లకు 57 శాతం గ్రీన్కార్డులిస్తామని ఆయన ప్రకటించారు. ‘‘మా దేశంలోకి వలసలు సాగాలి. ఆ వలసలు ప్రతిభ ఆధారంగానే రావాలి. దాని వల్ల అమెరికాలో భిన్నత్వం (వైవిధ్యం) పరిఢవిల్లుతుంది.
అందుకే ఇప్పుడున్న గ్రీన్ కార్డులను తీసేసి, వాటి స్థానంలో ‘బిల్డ్ అమెరికా వీసా’లను ప్రవేశపెట్టబోతున్నాం” అని ట్రంప్ ప్రకటించారు. కెనడా, ఇతర దేశాల్లాగా పాయింట్ల ఆధారంగా ‘బిల్డ్ అమెరికా వీసా’ ఇచ్చే వ్యవస్థను నిర్మిస్తామన్నారు. ప్రతిభ లేని వాళ్లకు గ్రీన్కార్డులిస్తుండడం వల్ల చాలా మంది అమెరికాలో కంపెనీలు పెట్టలేకపోతున్నారని, దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. తక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్న అమెరికన్ల స్థానంలో విదేశీయులు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారన్నారు. దాని వల్ల అమెరికన్ల ఉపాధి పోతోందన్నారు. అల్పాదాయ అమెరికన్ల పొట్ట కొట్టకుండా ఈ కొత్త విధానం దోహదపడుతుందన్నారు.