రాముడి గుడికి ట్రస్టు

రాముడి గుడికి ట్రస్టు

పేరు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర
ఆలయానికి 67.7 ఎకరాల భూమి
లోక్ సభలో ప్రకటించిన ప్రధాని మోడీ
యూపీ సున్నీ వక్ఫ్​బోర్డుకు ఐదెకరాలు
ఎన్నికల కోడ్​ ఉల్లంఘనే.. ప్రతిపక్షాల ఆరోపణ
సుప్రీం ఆదేశాలనే అమలు చేశారన్న ఈసీ

రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకం. తీర్పును ప్రజలు రిసీవ్​ చేసుకున్న విధానం చాలా బాగుంది.  ప్రజాస్వామ్యంపై వారు పెట్టుకున్న నమ్మకానికి నా సెల్యూట్. ఇదే నమ్మకాన్ని, సపోర్ట్​ను టెంపుల్ నిర్మాణంపైనా చూపించాలి.

– ప్రధాని మోడీ

న్యూఢిల్లీ/ లక్నో / ఇండోర్: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్టును ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం లోక్​సభలో ప్రకటించారు. టెంపుల్​ డెవలప్​మెంట్​కోసం ఓ స్కీంను కూడా తయారుచేసినట్లు చెప్పారు. కేంద్ర కేబినెట్​ మీటింగ్​లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని, కీలకమైన నిర్ణయం కావడంతో సభలో వెల్లడిస్తున్నట్లు ప్రధాని వివరించారు. ట్రస్టుకు 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. యూపీ సన్నీ వక్ఫ్​ బోర్డుకు 5 ఎకరాల ల్యాండ్​ ఇవ్వడానికి యోగి సర్కారు అంగీకరించిందని మోడీ చెప్పారు. ట్రస్టు ఏర్పాటుకున్న ప్రాధాన్యాన్ని తెలిపేందుకు మోడీ ఈ ప్రకటనను రెండుసార్లు రిపీట్​ చేస్తూ సమ్మతి తెలపాలంటూ సభ్యులను కోరారు. రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పును ప్రజలు రిసీవ్​ చేసుకున్న విధానం చాలా బాగుందని, ప్రజాస్వామ్యంపై వారు పెట్టుకున్న నమ్మకానికి తాను సెల్యూట్​చేస్తున్నానని అన్నారు. అదే నమ్మకాన్ని, సపోర్ట్​ను టెంపుల్ నిర్మాణంపైనా చూపించాలని ప్రధాని కోరారు. దీనిపై సభ్యులు బల్లలు చరుస్తూ, జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్​ 9న రామజన్మభూమి వివాదంపై తీర్పును ప్రకటిస్తూ..  గుడి కట్టేందుకు 3 నెలల్లోగా ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. గడువు ఈ నెల 9తో ముగుస్తుంది.

ట్రస్ట్​లో 15 మంది సభ్యులు: అమిత్​ షా

రాముడి గుడి కట్టేందుకు ట్రస్ట్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ లోక్​సభలో ప్రకటించిన గంట తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పందించారు. ప్రధాని నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ట్రస్ట్​ ఏర్పాటు విధివిధానాలను వెల్లడిస్తూ.. ఒక దళిత సభ్యుడితో సహా 15 మంది ట్రస్టీలతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ను ఏర్పాటు చేస్తామని షా చెప్పారు. ట్రస్ట్ ఇండిపెండెంట్​గా వ్యవహరిస్తుందని, ఆలయ నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలను ట్రస్ట్ ​మెంబర్సే తీసుకుంటారని స్పష్టంచేశారు.

మోడల్​ మార్చదనుకుంటున్నం: వీహెచ్ పీ

రాముడి గుడి కట్టేందుకు ట్రస్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, గుడి కోసం ఇప్పటికే తాము తయారుచేసిన మోడల్​ను ట్రస్ట్​ మార్చదని నమ్ముతున్నట్లు విశ్వహిందూ పరిషత్​ పేర్కొంది. ఈమేరకు బుధవారం వీహెచ్​పీ ఇంటర్నేషనల్​ ప్రెసిడెంట్​విష్ణు సదాశివ కోక్జే  మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్రం ట్రస్ట్ ను ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రామజన్మభూమి న్యాస్​తో కలిసి రామమందిరం మోడల్​ను వీహెచ్​పీ తయారుచేసిందని గుర్తుచేశారు. దీనికి అనుగుణంగా శిల్పులు స్తంభాలను చెక్కారని తెలిపారు. వేలాది మంది సాధుసన్యాసులు, లక్షలాది హిందువుల మనోభావాలు టెంపుల్​ మోడల్​తో ముడిపడి ఉన్నాయని కోక్జే అన్నారు.

ఆ ఐదెకరాలిస్తే మేమే గుడి కడ్తం

సున్నీ సెంట్రల్​ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తమకిస్తే అందులో రామమందిరాన్ని తామే కడతామని ఉత్తరప్రదేశ్​ షియా సెంట్రల్​ వక్ఫ్​ బోర్డ్  ప్రకటించింది.    ‘‘ఆ ల్యాండ్​ షియా వక్ఫ్​ బోర్డుకు ఇస్తే.. మరో రామ మందిరాన్ని అక్కడ కడతాం”అని యూపీ షియా సెంట్రల్​ వక్ఫ్​ బోర్డ్  చైర్మన్​ వసీం రిజ్వి చెప్పారు.

వక్ఫ్​ బోర్డుకు ల్యాండ్​ ఎక్కడిచ్చారు?

లక్నో హైవేలో అయోధ్య  జిల్లా సోహావాల్​ తహశిల్​ పరిధిలోని ధాన్నిపుర్​ గ్రామంలో  సున్నీ సెంట్రల్​ వక్ఫ్​ బోర్డుకు ల్యాండ్​ కేటాయించారు.