హైదరాబాద్​తోపాటు అన్ని జిల్లాల్లో  బీఆర్​ఎస్​కు అగ్గువకే భూములు కేటాయింపు

హైదరాబాద్​తోపాటు అన్ని జిల్లాల్లో  బీఆర్​ఎస్​కు అగ్గువకే  భూములు కేటాయింపు
  • పార్టీ ఆఫీసుల పేరుతో వందల కోట్ల విలువైన స్థలాలు స్వాహా

హైదరాబాద్/నెట్​వర్క్​, వెలుగు: పార్టీ ఆఫీసుల పేరుతో  రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం బీఆర్ఎస్​కు అప్పనంగా కట్టబెట్టింది. కేటాయించిన జాగాకే పరిమితం కాని గులాబీ లీడర్లు.. పార్టీ ఆఫీసులను ఆనుకుని ఉన్న స్థలాలను కూడా ఆక్రమించుకొని భూదందా చేస్తున్నారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో పార్టీ హెడ్​క్వార్టర్స్​కు ఇప్పటికే ఒక బిల్డింగ్​ ఉండగా.. హైదరాబాద్​ జిల్లా ఆఫీస్​ కోసం బంజారాహిల్స్​లోనే రూ.150 కోట్ల విలువైన స్థలాన్ని కారుచౌకగా కట్టబెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ‘భారత్​ భవన్’ పేరుతో ఒక ఎక్సలెన్సీ సెంటర్​కు కోకాపేటలో రూ. 550 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ. 37 కోట్లకే తీసుకున్నారు. అక్కడా భారీ భూదందాకు గులాబీ నేతలు తెరతీశారు. ఇప్పుడు బీఆర్ఎస్​కు రూ. వెయ్యి కోట్ల విలువైన సొంత భూములు (మార్కెట్​ రేటు ప్రకారం) ఉన్నాయి. ఇందులో రూ.900 కోట్లకు పైగా విలువైన భూములు గులాబీ పార్టీ పవర్​లోకి వచ్చిన తర్వాత సొంతం చేసుకున్నవే. అధికారదండం తమ చేతుల్లోనే ఉండటంతో దాదాపు అన్ని జిల్లాల్లో  గజం రూ.100 చొప్పున హాట్​కేకుల్లాంటి స్థలాలను పార్టీ ఆఫీసుల పేరిట తీసుకున్నారు. 

ఎక్కువ సొంత ఆఫీసులున్న పార్టీగా..!

ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్ఎస్​ (టీఆర్ఎస్) పార్టీ ఆఫీస్​నిర్మాణానికి బంజారా హిల్స్​లోని రోడ్​నం.12లో ఎకరం స్థలం కేటాయించారు. ఇప్పుడున్న తెలంగాణ భవన్​ఆ స్థలంలో నిర్మించిందే.   తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసేందుకు, నిధులు కూడబెట్టేందుకు ‘గులాబీ కూలీ’ చేసిన పార్టీ.. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే ధనిక పార్టీల్లో ఒకటిగా అవతరించింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో సొంత ఆఫీస్​ బిల్డింగులున్న పార్టీ కూడా బీఆర్ఎస్సే. ఇదంతా కేవలం తొమ్మిదేండ్ల వ్యవధిలోనే సాధ్యమైంది. 

33 జిల్లాలుగా మార్చాక..!

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ పేరుతో పది జిల్లాలను 33 జిల్లాలు చేశారు. ప్రతి జిల్లాలో గవర్నమెంట్​ఆఫీసులు ఉన్నట్టే గులాబీ పార్టీకి ఆఫీస్​ ఉండాలని కేసీఆర్ ​నిర్ణయించారు. 33 జిల్లాల్లో దాదాపు ఎకరం చొప్పున ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీస్​కు కట్టబెట్టారు. 

గజం.. వంద రూపాయలకే!

జిల్లా కేంద్రాల్లో అత్యంత విలువైన భూములను బీఆర్​ఎస్​ ఆఫీసుల కోసం గజం రూ.100 చొప్పున అంటే ఎకరాకు కేవలం రూ. 4 లక్షల 84 వేలకు కేటాయించుకున్నారు. జిల్లా కేంద్రాలన్నీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే కావడంతో ప్రస్తుతం ఆయా చోట్ల బహిరంగ మార్కెట్​లో  ఎకరా రూ. 3 కోట్ల నుంచి 30 కోట్ల దాకా పలుకుతున్నది. ఒక్కో దగ్గర ఒక్కో రేటు ఉన్నప్పటికీ సర్కారు మాత్రం దాదాపు అన్ని చోట్ల గజానికి రూ.100 చొప్పున కేటాయించుకుంది. మొత్తంగా 33 జిల్లాల ఆఫీసుల కోసం రూ. 469 కోట్ల విలువైన సుమారు 34 ఎకరాల భూమిని అగ్గువ ధరకు తీసుకున్నారు. ఈ భూముల కేటాయింపులో సర్కారు అన్ని నిబంధనలను ఉల్లంఘించింది. రాష్ట్రంలో అసైన్డ్​ భూములు అమ్మడం, కొనడం నేరం. కానీ మహబూబాబాద్, యాదాద్రి, కామారెడ్డి లాంటి పలు జిల్లాల్లో అసైన్డ్​ భూములను బీఆర్ఎస్​ ఆఫీసుల కోసం కేటాయించుకున్నారు. జగిత్యాల, నిజామాబాద్ ఆఫీసుల కోసం ఎస్సారెస్పీ భూములను,  ఖమ్మం ఆఫీసు కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు భూములను , నిర్మల్​లోనైతే దళితులకు కేటాయించిన ఎస్సీ కార్పొరేషన్ భూములను తీసుకున్నారు. వరంగల్‌‌, హనుమకొండ ఆఫీసుల కోసం అత్యంత విలువైన ‘కుడా’ భూములను, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌‌, మహబూబాబాద్‌‌, మేడ్చల్‌‌ జిల్లాల్లో కార్పొరేషన్​ భూములను కేటాయించుకున్నారు. 

భూముల రాష్ట్ర సమితి

మార్కెట్​లో రూ. కోట్ల విలువ చేసే స్థలాలను రూ. లక్షలకే ధారాదత్తం చేశారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లోనే  పార్టీ స్టేట్​హెడ్ క్వార్టర్స్​ఉండగా.. బంజారాహిల్స్​ రోడ్​నం.12లో రూ.150 కోట్ల విలువైన స్థలాన్ని హైదరాబాద్​జిల్లా ఆఫీస్​కోసం అప్పగించారు. హన్మకొండ జిల్లా ఆఫీస్​ను వరంగల్​నగర నడిబొడ్డు బాలసముద్రంలో నిర్మించారు. ఖమ్మం రోడ్డులోని నాయుడు పంపు వద్ద వరంగల్​ జిల్లా ఆఫీస్​ నిర్మాణానికి కొన్ని రోజుల కిందట్నే కేటీఆర్​శంకుస్థాపన చేశారు. మేడ్చల్​మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ పార్టీ ఆఫీస్​ల కోసం విలువైన స్థలాలే ఇచ్చారు. జిల్లాల ఆఫీసుల కోసం మొత్తం 33 జిల్లాల్లో స్థలాలు కేటాయించగా.. ఇందులో సగానికి పైగా భవనాల నిర్మాణం పూర్తయింది. కాగా, హైదరాబాద్​లోని కోకాపేటలో ‘భారత్​భవన్’ ​పేరుతో నిర్మించే రీసెర్చ్​ సెంటర్​ఫర్​ఎక్సలెన్స్​కు కేసీఆర్ సోమవారం భూమిపూజ చేశారు. రూ. 550 కోట్ల విలువైన ఈ స్థలాన్ని గులాబీ పార్టీకి అత్యంత చవకగా కట్టబెట్టారు. 15 అంతస్తుల్లో అధునాతన సాంకేతికతతో ఇక్కడ బిల్డింగ్​నిర్మిస్తున్నారు. 

ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ..!

బీఆర్ఎస్​రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో పార్టీ ఆఫీస్​ కోసం స్థలం ఇవ్వాలని దరఖాస్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వసంత్​ విహార్​లో స్థలం కేటాయించగా.. నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు. దీని మార్కెట్​విలువ రూ.75 కోట్ల వరకు ఉంటుందని అంచనా.  టీఆర్ఎస్​పేరు బీఆర్ఎస్​ మార్చిన తర్వాత మహారాష్ట్రపై ఫోకస్​ పెట్టిన కేసీఆర్​.. ఆ రాష్ట్రంలోని నాందేడ్​లో ఇప్పటికే ఒక భవనం కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా వెల్లడించారు. ఔరంగాబాద్​లో భవన నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేశారు. ఈ రెండింటి మార్కెట్​విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని నేతలు చెప్తున్నారు. ఏపీలో పార్టీ ఆఫీస్​ఏర్పాటు చేసినా.. అది పార్టీ సొమ్ముతో కాకుండా అక్కడి నేత సొంతంగా ఏర్పాటు చేశారని పార్టీ నాయకులు అంటున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ​లోనూ పార్టీకి సొంత ఆఫీస్​భవనాల అన్వేషణలో కేసీఆర్ ఉన్నారని ప్రగతి భవన్​వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్​పార్టీ ఖాతాలో రూ. 1,250 కోట్ల నిధులున్నట్లు ఏప్రిల్​27న నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో కేసీఆర్​వెల్లడించారు. ఇందులో రూ.767 కోట్లు బ్యాంకులో డిపాజిట్​చేశామని, వాటి ద్వారా నెలకు రూ. 7 కోట్ల వడ్డీ వస్తుందని, ఆ మొత్తంతో పార్టీని నడిపించడంతో పాటు జిల్లాల్లో పార్టీ ఆఫీస్​ల నిర్మాణం, నిర్వహణ ఇతర కార్యక్రమాలు చేస్తామన్నారు.