మండల, జిల్లా పరిషత్​లకు రూ. 250 కోట్లు

మండల, జిల్లా పరిషత్​లకు రూ. 250 కోట్లు
  • ఎమ్మెల్సీ ఎన్నికల ముంగట
  • మండల, జిల్లా పరిషత్​లకు రూ. 250 కోట్లు
  • విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు 
  • ఆగస్టులోనే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ 
  • ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు శాంక్షన్ 
  • ఎన్నికల్లో లబ్ధి కోసమేననే విమర్శలు

హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ముంగట మండల, జిల్లా పరిషత్ లకు రాష్ట్ర సర్కార్ నిధులు విడుదల చేసింది. బడ్జెట్ లో కేటాయించిన ఫండ్స్ లో సగం రూ.250 కోట్లను మంజూరు చేసింది. వీటిలో జిల్లా పరిషత్ లకు రూ.125.87 కోట్లు, మండల పరిషత్ లకు రూ.124.13 కోట్లు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది. జడ్పీ సీఈఓలు పీడీ అకౌంట్లు వెరిఫై చేసుకోవాలని, మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ ఆదేశించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనే ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ బడ్జెట్​రిలీజ్​ఆర్డర్​ఇచ్చినప్పటికీ, ఇన్ని రోజులు నిధులు విడుదల చేయని సర్కార్... ఇప్పుడు ఐదు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా మంజూరు చేసింది. కాగా, కరీంనగర్​లోని రెండు, నల్లగొండ, ఆదిలాబాద్​, ఖమ్మం, మెదక్​లో ఒక్కో స్థానానికి ఈ నె 10న ఎన్నికలు జరగనున్నాయి. 
ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పోటీలో నిలవడంతో.... 
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఓటర్లుగా ఉన్నారు. ప్రభుత్వం తమకు ఫండ్స్ ఇవ్వడం లేదని గత రెండున్నరేండ్ల నుంచి వాళ్లు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. చాలాసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో సర్కార్ తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ చాంబర్ తరఫున కొందరు నామినేషన్లు వేశారు. చాంబర్ తరఫున కొంతమంది టీఆర్ఎస్ నేతలు కూడా రెబల్స్ గా బరిలోకి దిగారు. దీంతో అధికార పార్టీకి షాక్ తగిలినట్లయింది. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ లో టఫ్ ఫైట్ నెలకొంది. అయితే అన్ని స్థానాల్లోనూ గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే క్యాంపులు పెట్టి ఓటర్లను ఇతర రాష్ట్రాల్లోని హోటళ్లు, రిసార్టులకు తరలించింది. కాగా, తమకు ఫండ్స్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించడంతోనే సర్కార్ నిధులు మంజూరు చేసిందని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పేర్కొంటున్నారు. సగం కాదు.. మొత్తం నిధులూ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన రూ.250 కోట్లనూ ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి డిమాండ్​ చేశారు.