సామాజిక కళాకారులకే గద్దర్ అవార్డు

సామాజిక కళాకారులకే గద్దర్ అవార్డు

మన కాలపు గొప్ప ప్రజాస్వామిక ఉద్యమ కళాకారుడు గద్దర్.  తన తల్లిదండ్రుల వారసత్వం, అట్టడుగు వర్గాల జన జీవితాల నుంచి తను ఎంచుకున్న పోరాట మార్గాల నుంచి పదునుదేరిన గొంతు గద్దర్.  గుమ్మడి విఠల్ నుంచి గద్దర్​గా పరివర్తన చెందిన ఆయన పయనం సామాజిక, ఆర్థిక అసమానతలపైన, స్వేచ్ఛ అణచివేతలమీద, సామాజిక అన్యాయం మీద  గొంతెత్తి నిలిచింది. సాయుధ పోరాట రాజకీయాలను నమ్మిన కాలంలోనూ,  అంబేద్కర్ స్ఫూర్తితో  సాగిన, రాజ్యాంగబద్ధ సామాజిక మార్పు నుంచి చివరికి దేశంలోని గడ్డు పరిస్థితి  రాజ్యాంగ పరిరక్షణ కోసం నినదించిన సమయంలోనూ గద్దర్​ విప్లవాత్మక సామాజిక ఆర్థిక పరివర్తనను కోరుకున్నాడు. జానపద కళారూపాలను  ప్రజాస్వామిక, సామాజిక, ఆర్థిక మార్పుకోసం ప్రజాకళలు అనే పేరుతో నవీకరించాడు. జనం ఆలోచనలను, ఆచరణలను  ప్రభావితం చేసిన గొప్ప వాగ్గేయకారుడు గద్దర్. 

తొలుత లాల్ తరువాత నీల్  పోరాటాలకు వారధిగా నిలిచినవాడు గద్దర్.  జీవితపు చివరి దశలో ఆయన తన శక్తిని తెలంగాణా ఉద్యమానికి,  దళిత అస్తిత్వ పోరాటానికి, వాటి నుంచి ధిక్కార  స్వరాలకు బాసటగా నిలిచాడు. ఇటువంటి  మహా మనీషి  పేరిట  తెలంగాణా ప్రభుత్వం  అవార్డు ఇవ్వాలి అని భావించడం  మంచిదే. అయితే  ఇప్పుడు సినిమా, నాటక సంబంధ రంగాలకు ఇస్తున్న నంది అవార్డు స్థానంలో  గద్దర్ అవార్డు  ఇస్తాం అని సర్కారు వారు  చెప్పడమే ఒకింత   సమంజసంగా అనిపించడం లేదు.  

సినిమా, నాటక రంగాలు గొప్పవే. అవి ఆధునిక కాలంలో ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసేవే. అయితే  గద్దర్  ఎంచుకున్న కళా క్షేత్రానికి, కళాతత్వానికి, ఆచరణకు బాగా వ్యాపారమయం అయిపోయి  విపరీత పోకడలు పోతున్న ఈ రంగాలకు పొంతన ఏమీలేదు. ఆయన  వ్యాపార కళాకారుడు కాదు. చాలా ప్రయత్న పూర్వకంగా  ఆ రంగానికి దూరంగా ఉన్న మనిషి ఆయన.  చాలా చాలా పరిమితంగా మాత్రమే ఆయన  జనరంజక సినిమా వైపు  తొంగి చూసినాడు.

గద్దర్​ నాద విజ్ఞాని

గద్దర్​ పేరిట ఇచ్చే అవార్డు ఆయన వంటి కృషి చేసిన కళారంగంలోని వారికి ఇవ్వడమే మంచిది. అట్లా కాకుండా ఆయన ఆలోచనా ఆచరణలతో ఇసుమంత సమబంధం లేనివారికి, ఆయన భావాలకు వ్యతిరేకంగా పనిచేసేవారికి  ఆయన పేరిట అవార్డు ఇవ్వడం ఆ  కీర్తిశేషుని  కీర్తిని ఏమాత్రం పెంచజాలదు. ఆయన పేరును సార్వత్రికం చేయడం ద్వారా ఆయన నిలిచిన విలువలు ఏమిటో తెలియకుండా పోయే ప్రమాదం ఉంది. గద్దర్  సామాజిక మార్పు కోసం పోరాడిన నాద విజ్ఞాని.  మామాలు మాటల్లో  గొప్ప లోతుగల భావాలను పలికించిన ధీశాలి.  ఆయన జానపద సంగీత, సాహిత్యాల అపురూప కలయిక. ఆట, మాట, పాట మూడింటినీ ఆయాపాళ్లలో కలిపి సామాజిక మార్పుకోసం వాహికగా మార్చిన నేర్పు ఆయన సొంతం.  ప్రజాకళాకారుల జన గానం, ఆశుకవుల వారసత్వం ఆయనది.  సామాజిక, ఆర్థిక పరివర్తన కోసం  తమ కళా కౌశాల్యాన్ని వాడినవారు మాత్రమే గద్దర్ పేరిట అవార్డు పొందటానికి అర్హులు.  ప్రభుత్వం గద్దర్ ను గౌరవించ దలుచుకుంటున్న  సందర్భంలో ఈ దిక్కు ఆలోచన చేయాలి. అది మాత్రమే ఆయన స్ఫూర్తిని  నిలిపే చర్య అవుతుంది. 

జాషువా మాదిరి గద్దర్​

గద్దర్​ను దళిత, దళితయేతర అనే రాజకీయ  ద్వంద్వాల నడిమికి లాగడం వివేకవంతం కాదు. జాషువా మాదిరి గద్దర్..  మార్పు కోసం గొంతు ఎత్తిన విశ్వ మానవుడు.  గద్దర్ పేరిట అవార్డు ఇవ్వాలని సర్కారు భావించడం ఒక గొప్ప సంకేతమే, కానీ ఆయనవంటి కృషిలో మునిగిన మనషులకు కాకుండా వేరేవారికి ఆయన పేరిట  అవార్డును ఇవ్వటం ఆయన స్ఫూర్తిని చిన్నబుచ్చడం అవుతుంది. ఒక జీవిత కాలం సామాజిక, ఆర్థిక పరివర్తనకు తన వంతు కృషిని, ప్రాణాలకు తెగించి చేసిన మహా మానవుని పేరిట, అటువంటి పనితో సంబంధం లేనివారికి ఇవ్వడం అనుచితం. ప్రభుత్వం గద్దర్ ను సముచితంగా గౌరవించాలి అనుకుంటే ఆయన పేరిట ఆయన స్మారక మ్యూజియం, గ్రంథాలయం, నిర్మించవచ్చు. రాష్ట్ర రాజధానిలో ప్రధాన కూడలిలో  భారీ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా అభినందనీయం.    

గద్దర్​ ఔన్నత్యం ప్రధానం

తెలంగాణలో సినిమా, నాటక రంగాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలపు నంది అవార్డు స్థానంలో  మరో పేరిట అవార్డు ఇవ్వాలి అని సర్కారువారు అనుకుంటే దానికి వేరే ఏర్పాటు చేసుకోవచ్చు.  పాల పిట్టను  రాష్ట్ర పక్షిగా ప్రకటించిన తీరులో..  రామప్ప గుడివంటి  దానినో,  మరొక దానినో దానికి ఎంచుకోవచ్చు. గద్దర్ పేరిట ఇచ్చే అవార్డును ఒక సాధారణ అవార్డుగా మార్చవద్దనేదే ఇక్కడ ప్రధాన అంశం. నంది అవార్డు వంటివి సర్కారు వారు ఇచ్చే సార్వత్రిక  అవార్డులు.  వాటికి గద్దర్ జీవన యానానికి పొంతనే లేదు.

నంది అవార్డుకు ప్రతిగా గద్దర్ అవార్డు పెట్టడం ఔచిత్యం లేని తొందరపాటు చర్య అవుతుంది.  ’గద్దర్ పేరిట  తెలంగాణా  ప్రభుత్వం ఒక సార్వత్రిక అవార్డును ఇవ్వడాన్ని దళితులు కానీ వారు సహించ లేకపోతున్నారు అని, ఇది దళితుల పట్ల ఉన్న తీవ్ర వివక్షకు అది సంకేతం’’ అని  దళితవాదులలో ఒక బృందం, వారి సమర్థకులు వాదిస్తున్నారు. ఈ వాదం  అధికారంలో ఉండే పాలక శక్తులు గద్దర్​ను గుర్తించడం గొప్ప విషయం అని భావిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ, గద్దర్ పేరిట ఇచ్చే అవార్డు ఔన్నత్యం, విలువ తక్కువ కాకూడదు అనేదే ప్రధానం.  

- హెచ్. వాగీశన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా

  • Beta
Beta feature
  • Beta
Beta feature