ప్రాజెక్టులకు అప్పులు మరో 6,500 కోట్లు

ప్రాజెక్టులకు అప్పులు మరో 6,500 కోట్లు
  • నాబార్డు నుంచి తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
  • లిక్కర్ షాపుల్లో గౌడలు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
  • వచ్చే ఏడాది నుంచే కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం
  • పోడు భూములు, ధరణి సమస్యలపై
  • వేర్వేరుగా కేబినెట్ సబ్​ కమిటీలు
  • ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు: బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్​లు, బస్వాపూర్ రిజర్వాయర్​ నిర్మాణం కోసం నాబార్డు నుంచి అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఈ మూడింటికి కలిపి దాదాపు రూ.6,500 కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. లిక్కర్ షాపుల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేసింది. పోడు భూములు, ధరణి సమస్యలు, కొత్త జిల్లాల్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లపై మూడు వేర్వేరు కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం మధ్నాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌‌‌‌లో కేబినెట్ భేటీ జరిగింది. ఆరు గంటలు సాగిన మీటింగ్​లో వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది నుంచి కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభానికి కేబినెట్ ఓకే చెప్పింది. కాలేజీలకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించింది. హైదరాబాద్‌‌‌‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం వేగంగా జరగాలని స్పష్టం చేసింది.
నాబార్డు లోన్లతో ప్రాజెక్టుల పనులు
సంగారెడ్డి, ఆంధోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్స్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి అవసరమైన రూ.2,653 కోట్లు అప్పుగా తీసుకునేందుకు పరిపాలన పరమైన అనుమతులిచ్చింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి అవసరమైన రూ.1,774 కోట్లకు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 15,16లో భాగంగా యాదాద్రి జిల్లాలో నిర్మాణం అవుతున్న నృసింహసాగర్ (బస్వాపూర్ రిజర్వాయర్​)కు రూ.2,051.14 కోట్ల లోన్​పొందేందుకు ఓకే చెప్పింది. ఈ మూడింటికి నాబార్డు నుంచే అప్పులు తీసుకునేందుకు ఇరిగేషన్ ​డిపార్ట్​మెంట్​కు కేబినేట్ అనుమతించింది.
గౌడలకు 15, ఎస్సీలకు 10 శాతం
గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అనుమతి తెలిపింది. రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వినతి మేరకు.. నారాయణగూడలో 1,261 గజాల స్థలాన్ని గర్ల్స్​ హాస్టల్​ నిర్మాణం కోసం కేటాయించింది. రాష్ట్రంలో భారీ వర్షాలకు పాడైన రోడ్ల రిపేర్లకు ఇప్పటికే కేటాయించిన రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించింది.
థర్డ్ వేవ్‌‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. పక్క రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి, నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. థర్డ్ వేవ్‌‌లో చిన్న పిల్లలకు కరోనా వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆఫీసర్లు రాష్ట్ర కేబినెట్‌‌కు తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తర్వాత కరోనా కేసులు పెరగలేదని, పూర్తిగా అదుపులోనే ఉందని వివరించారు. మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.56 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పారు. గురువారం నుంచి స్పెషల్‌‌ డ్రైవ్‌‌ చేపట్టినట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లల వైద్యం కోసం రూ.133 కోట్ల ఖర్చుతో 5,200 బెడ్లు, మందులు  సమకూర్చుకున్నామని ఆఫీసర్లు తెలిపారు.
ఈ నెల 24 నుంచి అసెంబ్లీ
ఈ నెల 24వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీలో ఏయే అంశాలు చర్చించాలి? బిల్లులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా అనే దానిపై చర్చించింది. ఖరీఫ్‌‌లో రాష్ట్రంలో మొత్తం సాగైన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితరాలపై మాట్లాడింది. పంటల కొనుగోళ్లు, అందుకు మార్కెటింగ్ శాఖ చేసిన ఏర్పాట్లపైనా డిస్కస్ చేసింది.
3 వేర్వేరు సబ్ కమిటీలు
పోడు భూముల సమస్యలపై ఏర్పాటైన సబ్ కమిటీకి మంత్రి సత్యవతి రాథోడ్ చైర్ పర్సన్‌‌గా.. మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ధరణి పోర్టల్‌‌లో తలెత్తుతున్న సమస్యల పరిష్కార మార్గాల కోసం మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ పని చేయనుంది. హోం మంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది.