
- ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 251 ఎకరాలు
- ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ విలువే రూ.650 కోట్లు!
- విలీనంతో అన్నీ సర్కారు అధీనంలోకి
హైదరాబాద్, వెలుగు: వేల కోట్ల ఆస్తులతో ప్రభుత్వంలో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(టీఎస్‌ఆర్టీసీ) విలీనం కాబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోలు, భూములన్నీ సర్కారు అధీనంలోకి వెళ్లనున్నాయి. 90 ఏండ్ల చరిత్ర గల ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 1,404 ఎకరాల భూములున్నాయి. బస్ భవన్ సహా డిపోలు, బస్టాండ్లు, కమర్షియల్కాంప్లెక్స్‌లు, ఇతర విలువైన ఆస్తులెన్నో సంస్థ సొంతం. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 250 ఎకరాల భూములున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఆర్టీసీ బస్‌భవన్, ముషీరాబాద్ డిపో, జీహెచ్ఎంసీ, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో అత్యంత విలువైన ల్యాండ్స్ ఉన్నాయి. వీటన్నింటి మార్కెట్ విలువ రూ.80 వేల కోట్లకు పైమాటేనని సంస్థ ఉన్నతాధికారులు చెప్తున్నారు.
అన్నీ విలువైన భూములే..
ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా మూడు జోన్లలో 11 రీజియన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 96 డిపోలు కొనసాగుతున్నాయి. గతంలో 99 డిపోలు ఉండగా మూడు డిపోలను మూసేశారు.
రూ.80 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులు..ఇక సర్కార్కే
రెండు జోనల్ వర్క్ షాపులు, బస్ బాడీ యూనిట్ ఒకటి, రెండు టైర్ రీట్రేడింగ్ షాపులు, ప్రింటింగ్ ప్రెస్, హకీంపేట ట్రాన్స్‌పోర్టు అకాడమీ, స్టాఫ్ట్రైనింగ్ కాలేజీలు, 14 డిస్పెన్సరీలు, తార్నాక హాస్పిటల్, 364 బస్ స్టేషన్లు, హైదర్‌గూడ గెస్ట్ హౌస్, ఆర్టీసీ కల్యాణ మండపం, ఓల్డ్ అడ్మిన్ ఆఫీస్, ముషీరాబాద్ ఓపెన్ ప్లేస్, కాచిగూడ, చిలకలగూడ స్టాఫ్ క్వార్టర్స్, మెట్టుగూడ బంగ్లా తదితర ఆస్తులు ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 251.32 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 194.36 ఎకరాలు, వరంగల్‌లో 118.05 ఎకరాలు, ఖమ్మంలో 106.03 ఎకరాలు, నల్గొండలో 116.08 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 98.12 ఎకరాలు, నిజామాబాద్‌లో 134.20 ఎకరాలు, హైదరాబాద్‌లో 134.09 ఎకరాలు, మహబూబ్‌నగర్ లో 142.32 ఎకరాలు, మెదక్ జిల్లాలో 112.36 ఎకరాల భూములు ఆర్టీసీకి ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్ వాల్యూ రూ.17 వేల కోట్ల పైనే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అదే బహిరంగ మార్కెట్లో అయితే రూ. 80 వేల కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు.
బోర్డు పాత్ర ఏమిటి?
ఆర్టీసీకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలకు టీఎస్‌ఆర్టీసీ బోర్డు అనుమతి తప్పనిసరి. ఆర్టీసీ చైర్మన్‌తో పాటు ఎండీ, కార్మిక శాఖ స్పెషల్ సీఎస్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్, ఆర్ అండ్ బీ ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ, కేంద్ర రోడ్లు, ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ డైరెక్టర్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఇందులో సభ్యులుగా ఉంటారు. భూముల అమ్మకంతోపాటు ఇంకేదైనా చేయాలన్నా బోర్డులో తీర్మానం పాస్ చేయాల్సి ఉంటుంది. అయితే బోర్డు ఏం నిర్ణయం చేసినా అదంతా ఆర్టీసీ కోసం, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం అయితే.. సంబంధిత శాఖ సెక్రటరీ జీవో ఇవ్వడంతోనే ఏ పని చేయాలన్నా కంప్లీట్అవుతుంది. దీంతో ఆర్డీసీ బోర్డు అధికారాలకు కత్తెర పడనుంది.
43 వేల మంది కార్మికులు, 9,144 బస్సులు
ఆర్టీసీలో 43,260 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారిలో డ్రైవర్లు 18,257 మంది, కండక్టర్లు 15,412 మంది, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ 9,591 మంది ఉన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి సంస్థలో 56,740 మంది కార్మికులు పని చేస్తుండగా తొమ్మిదేండ్లలో 13,480 మంది తగ్గిపోయారు. 9,144 బస్సులు ఉండగా.. అందులో సంస్థ కొనుగోలు చేసినవి 6,375, అద్దెకు తీసుకున్నవి 2,769 ఉన్నాయి. సంస్థకు నెలకు రూ.485.30 కోట్ల ఆదాయం వస్తుండగా రూ.531.36 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో నెలకు సగటున రూ.46.06 కోట్ల నష్టం వాటిల్లుతోంది. కార్మికుల వేతనాల కోసం నెలకు రూ.185.37 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు కార్మికులకు సంస్థ రెండు పీఆర్సీలు ఇవ్వాల్సి ఉంది. 2013లో ఇవ్వాల్సిన పీఆర్సీని 2015లో ప్రకటించారు. 2017, 2021 పీఆర్సీలు పెండింగ్‌లో పెట్టారు. వాటిని అమలు చేసి ఉంటే కార్మికుల జీతాలు భారీగా పెరిగేవి.. ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇవ్వకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు.
తొమ్మిదేండ్లలో రూ.11,500 కోట్ల నష్టాల్లోకి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆర్టీసీ రూ.299.64 కోట్ల నష్టాల్లో ఉండేది. కానీ ఈ తొమ్మిదేండ్లలోనే రూ.11,500 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. 2015లో ప్రకటించిన పీఆర్సీతో సంస్థపై రూ.850 కోట్ల భారం పడింది. ప్రభుత్వం సంస్థను పట్టించుకోకపోవడంతో ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున నష్టాల్లో కూరుకుపోయింది. 2015 –16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,150 కోట్ల నష్టం వస్తే, కార్మికులు 52 రోజులు సమ్మె చేసిన 2019 – 20లో రూ.1,002 కోట్ల నష్టం వచ్చింది. సంస్థ బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు రూ.2,500 కోట్లు, పీఎఫ్ ట్రస్ట్‌కు రూ.వెయ్యి కోట్లు, ఎస్బీటీ, ఏసీఎస్ కలిపి రూ.300 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే సంస్థ రూ.11,500 కోట్ల నష్టాల్లో ఉంది.
హైదరాబాద్‌లో భారీగా భూములు
ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్‌భవన్ విలువే దాదాపు రూ.650 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ నడిబొడ్డున ముషీరాబాద్ 1, 2, 3 డిపోలతో పాటు ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఇవన్నీ ఇంచుమించు 10 ఎకరాలపైనే ఉంటాయి. వీటికి దగ్గరలోనే ఆర్టీసీ కల్యాణ మండపం ఉంది. ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్, జూబ్లీ బస్‌స్టేషన్, హయత్‌నగర్ దగ్గర ఉన్న ఆర్టీసీ డిపో, భూములు, కరీంనగర్ జోనల్ వర్క్‌షాప్, కొన్ని ఆర్టీసీ భవనాలు, ల్యాండ్స్ తనఖా పెట్టి వివిధ బ్యాంకుల్లో సంస్థ అప్పులు చేసింది.
ఇదీ ఆర్టీసీ చరిత్ర
1932లో ఏడో నిజాం హయాంలో ‘నిజాం రాష్ట్ర రైల్వే- రోడ్డు రవాణా శాఖ’గా ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పుడు 27 బస్సులు, 166 మంది సిబ్బంది ఉండేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951 నవంబర్ 1న రాష్ట్రంలో హైదరాబాద్ విలీనమైంది. ఏపీ, తెలంగాణ విలీనం తర్వాత 1958 జనవరి 11న ఏపీఎస్‌ఆర్టీసీగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో 22,628 బస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థగా రికార్డులకెక్కింది. 1999లో గిన్నిస్ రికార్డు సాధించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత.. 2015 జూన్ 3న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) గా మారింది. టీఎస్ ఆర్టీసీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 27న రుణాలు, ఇతర అవసరాల కోసం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌కు సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 80 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.