స్కూల్ ఫీజులపై కంట్రోల్​ ఏదీ?..చట్టం చేస్తామంటూ రెండేళ్ల నుంచి హడావుడి

స్కూల్ ఫీజులపై కంట్రోల్​ ఏదీ?..చట్టం చేస్తామంటూ  రెండేళ్ల నుంచి హడావుడి
  • చట్టం చేస్తామంటూ రెండేండ్ల నుంచి సర్కారు హడావుడి 


హైదరాబాద్, వెలుగు:  ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ సంగతిని రాష్ట్ర సర్కారు మరిచిపోయింది. ఫీజులను కట్టడి చేస్తామంటూ తొమ్మిదేండ్ల నుంచి చెప్తున్న మా టలను ఆచరణలో మాత్రం పెట్టడంలేదు. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ అంటూ కొన్నాళ్లు, మంత్రుల కమిటీ అంటూ మరికొన్నాళ్లు ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేశారు. తీరా ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫారసులను పక్కన పారేశారు. మరో 20 రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబో తోంది. అయినా, ఇప్పటివరకూ కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడిపై ప్రభుత్వం మాట కూడా ఎత్తడం లేదు. దీంతో ఫీజులు మళ్లీ ఎంత పెంచుతారోనంటూ పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 10,700 వరకూ కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లుండగా, వీటిలో 32లక్షల మంది చదువుతు న్నారు. బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కొంత తక్కు వగానే ఉండగా, మిగిలిన ప్రైవేట్, కార్పొరేట్ బడుల్లో మాత్రం భారీగానే వసూలు చేస్తున్నారు. ఒక్కో స్కూల్​లో క్లాసును బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ మేనేజ్మెంట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పొందుపర్చారు. తొమ్మిదేండ్లు అయినా, ఫీజులను మాత్రం నియంత్రించడంలేదు. 

తిరుపతిరావు కమిటీ వేసినా.. 

పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్ల నుంచి సర్కారుపై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం 2017 మార్చి నెలలో ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. దీంట్లో మేనేజ్మెంట్లతో పాటు పేరెంట్స్ కు, అధికారులకు చోటు కల్పించింది. ఆ కమిటీ వివిధ రాష్ట్రాల్లోని స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసి సర్కారుకు నివేదిక అం దించింది. ఇందులో సర్కారుకు కమిటీ చేసిన కొన్ని సూచనలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ఏటా 10% ఫీజులు పెంచుకోవచ్చనే సూచనపై విమర్శలు వచ్చాయి. తర్వాత కమిటీ ఊసే లేకుండా పోయింది. 

మంత్రుల కమిటీదీ అదే కథ..  

స్కూళ్లతో పాటు కాలేజీల్లోనూ ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం14 మంది మంత్రులతో ఒక కమిటీని నియమించింది. కమిటీలో కేటీఆర్, హారీశ్​రావు, సబితా ఇంద్రారెడ్డి, దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇతర మంత్రులంతా ఉన్నారు. ఈ కమిటీ కూడా పలు మార్లు సమావేశమైంది. తర్వాత ఈ కమిటీ చేసిన సిఫారసుల్లోనూ కొన్ని బయటకు వచ్చాయి. తిరుపతిరావు కమిటీ రిపోర్టులోని అంశాలనే మినిస్టర్స్ కమిటీ కూడా సూచించింది. ఏటా10 శాతం ఫీజులు పెంచుకోవచ్చని, ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్ గా కమిటీ వేయాలని సిఫారసు చేసింది. దీంతో స్టూడెంట్ యూనియన్లు, పేరెంట్స్ నుంచి మళ్లీ వ్యతిరేకత రావడంతో సర్కారు ఈ కమిటీ రిపోర్ట్ నూ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

 జీవో1 అమలుకావట్లే 

రాష్ట్రంలో స్కూళ్ల మానిటరింగ్ అంతా జీవో నెంబర్ 1 ప్రకారం జరగాలి. దీని ప్రకారం 5 శాతం లాభాలు వచ్చేలా ఫీజులను వసూలు చేసుకోవాలి. అయితే, మేనేజ్మెంట్లు తప్పుడు లెక్కలతో అసలు లాభాలే లేవని, తమకు నష్టాలు వస్తున్నట్టు లెక్కలు చూపిస్తూ, ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తున్నారు. ఈ జీవోను సక్రమంగా అమలు చేసినా.. ఫీజులను కంట్రోల్ చే యొచ్చని విద్యాశాఖ అధికారులే చెప్తున్నారు. అప్పట్లో ఫీజుల నియంత్రణపై కొందరు పేరెంట్స్ హైకోర్టునూ ఆశ్రయించారు. దీనినుంచి తప్పించుకునేందుకు తిరుపతిరావు కమిటీ, మినిస్టర్స్ కమిటీ వేసినట్టు పేరెంట్స్ యూనియన్లు మండిపడుతున్నాయి.

సర్కారుకు చిత్తశుద్ధి లేదు  

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం హైద రాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్ పీఏ) తరఫున లీగల్​గా పోరాడుతున్నాం. ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు వేశాం. సర్కారుకు నోటీసులందినా హియరింగ్​కు వివరణ తో రావట్లేదు. జూన్​లో హియరింగ్ ఉంది. ఫీజుల నియంత్రణపై చిత్తశుద్ధి లేదు. అందుకే ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులను కంట్రోల్ చేయడంలేదు.  
- వెంకట్, హెచ్ఎస్ పీఏ ప్రతినిధి

చట్టం తేకుంటే ఆందోళనలు 

ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తామని మంత్రులతో కమిటీ వేసి ఏడాదిన్నర అయినా, సర్కారు ఇప్పటికీ చట్టం చేయలేదు. కార్పొరేట్ బడుల్లో ఫీజుల దోపిడీని అడ్డుకునేందుకు వెంటనే ప్రత్యేక చట్టం తేవాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ తో కలిసి ఆందోళనలు చేపడతాం.   
- టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి