
పోలీస్ ఎగ్జామ్స్‌లో 84% మంది క్వాలిఫై
ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌తోపాటు పలు పోస్టుల ఫలితాలు రిలీజ్
రీ వెరిఫికేషన్‌కు జూన్ 3 వరకు గడువు..
వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్
హైదరాబాద్, వెలుగు : ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ తోపాటు పలు పోస్టుల పరీక్షల ఫలితాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ మంగళవారం రిలీజ్ చేసింది. అన్ని విభాగాల్లో 1,79,459 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 1,50,852 మంది క్వాలిఫై అయినట్లు బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు వ్యక్తిగత ఓఎంఆర్ షీట్లు, ఫైనల్ కీని www.tslprb.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. సమస్యలుంటే 93937 11110, 93910 05006 నంబర్లు లేదా support@tslprb.in ఈ మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చని సూచించారు.
ఓఎంఆర్ షీట్లు, మార్కుల లెక్కింపులో అనుమానాలుంటే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇచ్చారు. జూన్ 1 నుంచి 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పేపర్‌కు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు, ఇతరులు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఎవరైనా వివరాల నమోదులో పొరపాట్లు చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నట్టు శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇప్పటికే దరఖాస్తులు చేసిన వారికి కులం, వయస్సు, లోకల్ క్యాండిడేచర్, ఎక్స్-సర్వీస్‌మెన్ స్టేటస్, అకడమిక్ క్వాలిఫికేషన్స్‌లో తప్పులను సరిచేసుకునేందుకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అవకాశం ఇస్తామని చెప్పారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామని తెలిపారు.