నిరుద్యోగులతో ఆడుకోవడమే.. అభ్యర్థుల అరణ్య రోదన

నిరుద్యోగులతో ఆడుకోవడమే.. అభ్యర్థుల అరణ్య రోదన

తెలంగాణ  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పురుడు పోసుకున్న వైనం బహిరంగ రహస్యమే. కానీ ఆ సంస్థ సభ్యుల కూర్పు పట్ల అనేక విమర్శ లు తలెత్తడం గమనార్హం.  టీఎస్​పీఎస్సీ ఓ రాజకీయ పునరావాస కేంద్రం గా మారిందనే వార్తలు వెల్లువెత్తడం తెలిసినదే.ఈ నేపథ్యంలో టీపీబీఓ, ఏఈ, ఏఈఈ, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల పేపర్లతో పాటు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు సైతం ఐదు, పది లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల కో పేపర్ చొప్పున అంగట్లో సరుకులలా విక్రయించారనీ, టీఎస్​పీస్సీ ఉద్యోగుల ద్వారానే ఇలాంటి అవినీతి అక్రమాలు జరిగినాయనే ఆరోపణలు వెల్లువెత్తిన వైనం బహిరంగ రహస్యమే. 

నోటిఫికేషన్ నిబంధనలను బేఖాతర్ చేస్తూ పరీక్ష లెలా నిర్వహించారన్న కోర్టు.  ముఖ్యం గా రెండోసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు కారణం టీఎస్​పీఎస్సీ ఓ కోటి రూపాయల ఖర్చులను తగ్గించుకోవడానికి బయోమెట్రిక్ తీసుకోవద్దని పరీక్షల నిర్వహణ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందనే వాదన విస్తుగొలిపుతున్నది. ప్రచార పటాటోపాల కోసం వందల కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న పాలకులకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ కోసం కేవలం ఒక కోటి రూపాయలను కేటాయించే వెసులుబాటు ఎందుకు కలగలేదనే ప్రశ్న యక్షప్రశ్న గా మిగిలిపోతుంది. 

పోతే సదరు చర్య మూలాన ఒకరి వంతుకు మరొకరు పరీక్ష రాసే వెసులు బాటును ఇవ్వడం ద్వారా అవినీతికి ఆస్కారాన్ని కలిగించేదనే కోర్టు అభిప్రాయంతో ఏకీభవించక తప్పదు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో పొందుపరిచిన విధి విధానాలకు భంగం కలిగించే విధం గా రెండవ సారి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించినందున తమకు అన్యాయం జరిగిందని అందుకే తమకు న్యాయం చేకూర్చమని తనను ఆశ్రయించిన అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం ద్వార హైకోర్టు రెండో సారి జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయడం గమనార్హం.

అభ్యర్థుల అరణ్య రోదన

ఫలితంగా వేల రూపాయల ఖర్చులతో కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల తరబడి శిక్షణ తీసుకుని పరీక్షలు రాసిన అభ్యర్థులు, చేయని నేరానికి టీఎస్​పీస్సీ నిర్వహణ లోపాల మూలంగా అసమర్థులైన పరీక్షల నిర్వహణ సిబ్బంది నిర్లక్ష్యం ఫలితంగా, మళ్ళీ రెండోసారి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష రద్దు కావడం అత్యంత దురదృష్ఠకరం. వేల రూపాయల ఖర్చులతో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కన్న తల్లిదండ్రులకూ, వున్న ఊరికి దూరంగా కరీంనగర్, ఖమ్మం,వరంగల్ హైదరాబాద్ లాంటి నగరాల్లో హాస్టళ్లలో నివసిస్తూ  ఉంటున్నారు. 

తడిసి మోపెడవుతున్న కోచింగ్ ఖర్చుల కోసం ఇల్లు గుల్ల చేసుకుంటూ ఏ పోటీ పరీక్ష రాసినా, ఆ పరీక్ష ఫలితం వస్తుందో లేదా పరీక్షే రద్దవుతుందో తెలియక  ఏళ్ల కేళ్ళుగా మానసిక ఒత్తిళ్ల కు లోనౌతున్న నిరుద్యోగ యువతను కాపాడాల్సిన బాధ్యత ఎవరిదో బోధపడడం లేదు. ఇంత జరుగుతున్నా పాలకులు అవినీతికి పాల్పడిన ఒకరిద్దరు ఉద్యోగులపై ఓ కంటి తుడుపు విచారణతో కాలం వెల్లబుచ్చారే తప్ప ఇంత అవినీతికి కారణమైన కమిషన్ సభ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే బుద్ధిజీవుల అభిప్రాయంతో ఏకీభవించక తప్పదు. 

మరోవైపు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనాలు గా నిలవాల్సిన కమిషన్ సభ్యులు సైతం స్వచ్ఛందంగా తమ పదవుల నుండి వైదొలగక పోవడం దురదృష్ఠ కరం. కమిషన్ వైఫల్యాలతో ఒకటి తర్వాత మరొక పోటీ పరీక్ష రద్దవుతుంటే ఇదేమిటని ప్రశ్నిస్తున్న బాధిత అభ్యర్థులూ,  నిరసన తెలియజేస్తే..  ప్రభుత్వమే వారిపై దాడికి పాల్పడుతున్న  వైనం బాధాకరమనే మేధావుల అభిప్రాయం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

ప్రక్షాళన చేయాల్సిందే

ఓ రాజ్యాంగ సంస్థగా పూర్తి స్వతంత్ర ప్రతిపత్తిగలిగిన సదరు కమీషన్ యూపీపీఎస్సీ ప్రేరణగా ఓ విస్పష్టమైన జాబ్ క్యాలెండర్​ని తయారుచేసి సదరు క్యాలెండర్​ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ నిజాయితీతో, నిష్పక్షపాతంగా, ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో పరీక్షలను నిర్వహించాలి. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కృత్రిమ మేధస్సుని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకుంటే ఆశించిన ఫలితాలను అందుకునే అవకాశాలు మెరుగు పడతాయి.

ఈ సంస్థ నిర్వహణపై రాజకీయ క్రీనీడ పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరమెంతైనా వుంది. అలా జరిగినప్పుడే సంస్థ చేసే ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరిగి కమీషన్ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. అర్హులైన అభ్యర్థులే ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికై  అత్యున్నత ప్రభుత్వ సేవలను రాష్ట్ర ప్రజల కు అందించగలుగుతారు.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డాక్టర్ నీలం సంపత్,  రిటైర్డ్  ప్రిన్సిపాల్