
- గ్రూప్1 ప్రిలిమ్స్ నుంచి ఐదు ప్రశ్నలు తొలగింపు
- ఫైనల్ కీ రిలీజ్ చేసిన టీఎస్‌పీఎస్సీ
- మూడు ప్రశ్నల్లో ఆప్షన్ల మార్పు
- ఒక్కో ప్రశ్నకు 1.0344 మార్కులు!
హైదరాబాద్, వెలుగు : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ మాస్టర్ ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ రిలీజ్ చేసింది. ఐదు ప్రశ్నలను పూర్తిగా తొలగించగా, మరో మూడు ప్రశ్నల ఆప్షన్లను మార్చింది. ప్రిలిమినరీ మాస్టర్ క్వశ్చన్ పేపర్‌లోని 28, 48, 69, 82, 138 ప్రశ్నల్లో తప్పులు ఉండటంతో వాటిని పూర్తిగా తొలగించారు. 57, 107, 133 ప్రశ్నల ఆన్సర్ ఆప్షన్లు మార్చారు. 107 ప్రశ్నకు నాలుగింటిలో ఏ ఆప్షన్ పెట్టినా మార్కులు కలుపుతారు.133 ప్రశ్నకు 1 లేదా 2 ఆప్షన్లలో ఏదీ పెట్టినా కరెక్ట్‌గానే భావిస్తారు. 5 ప్రశ్నలను తొలగించినా.. 150 మార్కులను145 ప్రశ్నలకు లెక్కించనున్నారు.
మంగళవారం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో కీ పెట్టినట్టు కమిషన్ సెక్రెటరీ అనితారాంచంద్రన్ వెల్లడించారు. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష గత నెల16న జరగ్గా.. 2,86,051 మంది అటెండ్ అయ్యారు. ప్రిలిమినరీ ‘కీ’ని 29న విడుదల చేయగా, 31 నుంచి ఈనెల 4 వరకు అభ్యంతరాలను టీఎస్‌పీఎస్సీ స్వీకరించింది. వెయ్యికి పైగా అభ్యంతరాలు రాగా.. ఎక్స్ పర్ట్ కమిటీ ఎగ్జామిన్ చేసి, కమిషన్ అధికారులకు అప్పగించింది. దీన్ని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం జరిగిన కమిటీ సమావేశంలో ఫైనల్ కీని అప్రూవ్ చేశారు.
మార్కులు జరంత పెరుగుతయ్
గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగానే తొలగించిన క్వశ్చన్ల మార్కులను.. మిగిలిన ప్రశ్నలకు కలుపుతున్నట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. దామాషా ప్రకారం మార్కులు ఇవ్వనున్నారు. దీంతో 150 క్వశ్చన్లకు సంబంధించి మార్కులను 145 క్వశ్చన్లకే లెక్కిస్తారు. ఈ లెక్కన ఒక్కో ప్రశ్నకు 1.0344 మార్కులుగా పరిగణిస్తారు. మరోవైపు రోస్టర్‌లో హారిజంటల్ విధానమే అనుసరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై సర్కారు నుంచి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. లేకపోతే కోర్టు తుది తీర్పు వచ్చే వరకూ వెయిట్ చేస్తామని అధికారులు చెప్పారు.