ఏ జాబ్​ ఎంచుకోవాలి .. ?

ఏ జాబ్​ ఎంచుకోవాలి .. ?

రాష్ట్రంలో వివిధ కొలువులకు ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒకే సారి ఉద్యోగ ప్రకటనలు విడుదల కావడంతో అభ్యర్థులు ఏ పరీక్షకు ప్రిపేర్​ అవ్వాలనే అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం గ్రూప్1, ​2, 3,4తో పాటు డీఏవో, ఏఈఈ, డీఎల్​(డిగ్రీ లెక్చరర్​), జేఎల్ (జూనియర్​ లెక్చరర్), హాస్టల్​ వార్డెన్స్​, స్టాఫ్​ నర్సు మొదలగు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు పరీక్ష తేదీలను ప్రకటించారు. అయితే అభ్యర్థులు ఏ కొలువుకు ప్రిపేర్​ అవ్వాలి, ఏ అంశాలను ప్రాతిపదికన తీసుకుంటే సక్సెస్​ సాధిస్తామో తెలుసుకుందాం..

ఇప్పటికే గ్రూప్​1 ప్రిలిమ్స్​ పరీక్ష రాసి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రిజల్ట్స్​ వచ్చాక గ్రూప్​1 మెయిన్స్​ రాయాలా.. వద్దా అనే అయోమయంలో కొందరు. ఫిబ్రవరిలో సివిల్​ సర్వీస్​ నోటిఫికేషన్​ రాబోతుంది. అందులో దాదాపు 1000కి పైగా ఉద్యోగాలు ఉండనున్నాయి. దీంతో సివిల్స్​కు ప్రిపేర్​ అయితే ఎలా ఉంటుంది.. లేకుంటే గ్రూప్​1 మెయిన్స్​కు సిద్ధం అవ్వాలా అనే డైలమాలో మరికొందరు ఉన్నారు.  ప్రస్తుతం ఎస్ఐ, కానిస్టేబుల్​ మెయిన్స్​ పరీక్ష తేదీలను టీఎస్​ఎల్​పీఆర్​బీ ప్రకటించింది. అయితే వీటితో పాటు గ్రూప్​4 పరీక్షకు ప్రిపేర్​ అయితే ఎలా ఉంటుందనే ఆలోచనలో కొందరు అభ్యర్థులు ఉన్నారు. ఇలాంటి సందిగ్ధంలో ఉన్న అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అనుకున్న కొలువు సాధించే అవకాశం ఉందో చూద్దాం.

ప్రిపరేషన్​ డిసైడ్​ చేసేవి

  •     దాదాపు 50 శాతం సిలబస్​ కామన్​గా ఉంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలకు ప్రిపేర్​ కావచ్చు.
  •     సిలబస్​ మారిందా, ఒకవేళ మారితే మారిన సిలబస్​కి సిద్ధమవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో అంచనా వేసుకోవాలి. 
  •     ప్రిపేర్​ అయ్యే ఉద్యోగానికి మీరు చేసిన డిగ్రీలో సేమ్​ సబ్జెక్టులు ఉంటే దానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. 
  •     మీ కేటగిరీ లేదా మీ జోన్​, జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. పోటీ ఎలా ఉందో అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా సిద్ధమవ్వాలి. పోస్టులు లేకుండా          ఇప్పటి వరకు మీకు తెలియని సిలబస్ ఉంటే ఆ జాబ్​కు ప్రిపేర్​ అవ్వకపోవడమే ఉత్తమం.

గ్రూప్​ 2  ​స్ట్రాటజీ: గ్రూప్​ 2లో సిలబస్​ పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇందు కోసం ఎవరైతే ప్రామాణికమైన పుస్తకాలు చదువుతున్నారో వారికి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇటీవల జరిగిన గ్రూప్​1 ప్రిలిమ్స్​, ఎస్​ఐ, కానిస్టేబుల్​ ప్రిలిమ్స్​, సీడీపీవో జనరల్​ స్టడీస్​ పేపర్​తో  ​పూర్తిగా అర్థం అయింది.  రాష్ట్ర అంశాలపై పూర్తిగా పట్టు సాధించాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమం, ఎకానమీ, జాగ్రఫీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మంచి అవగాహన ఉండాలి. కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశాల నుంచి సుమారు 300 మార్కులు వచ్చే అవకాశం ఉంది. గతంలో గ్రూప్​2 లేదా గ్రూప్​1 కోసం సీరియస్​గా ప్రిపేర్​ అయిన అభ్యర్థులకు గ్రూప్​2 కొలువు సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి సిలబస్​తో పాటు సబ్జెక్టుపై మంచి అవగాహన ఉంటుంది. సివిల్​ సర్వీస్​ ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులు దాదాపు 300 మార్కులు ప్రిపేర్​ అయ్యి ఉంటారు. వారు రాష్ట్ర స్థాయి అంశాలపై ఫోకస్​ చేస్తే కొలువు కొట్టడం ఈజీగా ఉంటుంది.  ముఖ్యంగా రీజనింగ్​, అర్థమెటిక్​పైన కాకుండా జనరల్​ స్టడీస్​ మీద పట్టున్న అభ్యర్థులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం 600 మార్కుల్లో కేవలం 20 నుంచి 25 మార్కులు మాత్రమే రీజనింగ్​ అండ్​ అర్థమెటిక్​ నుంచి వస్తాయి.  టీచర్​ ఉద్యోగంతో పాటు జర్నలిజం చేస్తున్న వారు, గతంలో గ్రూప్​4, పంచాయితీ సెక్రటరీ ఉద్యోగం సాధించిన వారికి జనరల్​ స్టడీస్​ మీద ఎక్కువ నాలెడ్జ్​ ఉండడంతో వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  

పోలీస్​ కొలువుల వ్యూహం

ఎస్​ఐ, కానిస్టేబుల్​ మెయిన్స్​ సిలబస్​ దాదాపు ఒకటే, కాకపోతే కొన్ని సబ్జెక్టులు ఎస్​ఐలో ఉంటే కానిస్టేబుల్​లో ఉండవు. ముందుగా దేనికి సిద్ధమవుతున్నారనే క్లారిటీ తెచ్చుకొని అందులో సిలబస్​ ఏం ఇచ్చారు, ఎలా ప్రిపేర్​ అవ్వాలో ప్లాన్​ వేసుకోవాలి. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎస్​ఐలో ఉంది కాని, కానిస్టేబుల్​లో లేదు. అదే విధంగా తెలంగాణ చరిత్ర సిలబస్​ కానిస్టేబుల్​ పరీక్ష ఉండి, ఎస్​ఐ పరీక్షలో లేదు. కాబట్టి సిలబస్​ దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్​ చేసుకుంటే అనుకున్న కొలువు సాధించవచ్చు. ఎస్​ఐ, కానిస్టేబుల్​ సీరియస్​గా ప్రిపేర్​ అయ్యే అభ్యర్థులు గ్రూప్​4 ఉద్యోగానికి సన్నద్ధం అవడం మంచిది. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు దాదాపు 50 శాతం సిలబస్​ ఒకేలా ఉంటుంది. కాకుంటే కొన్ని సబ్జెక్టులకు ఎక్కువ, కొన్నింటికి తక్కువ మార్కుల వెయిటేజీ ఉంటుంది. 

గ్రూప్​4 ఎవరికి సులువు: ఎస్​ఐ, కానిస్టేబుల్​ ప్రిలిమ్స్​ లేదా మెయిన్స్​ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మ్యాథ్స్​ బ్యాక్​గ్రౌండ్​ ఉన్నవారికి, డిగ్రీ, పీజీలో మ్యాథ్స్​ సబ్జెక్ట్​ చదివిన వారికి కొంచెం ఎక్కువ చాన్స్​ ఉంటుంది. బ్యాంక్​, ఎస్​ఎస్​సీ​, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు కూడా మంచి అవకాశం. గ్రూప్​4 లో మొత్తం రెండు పేపర్లలో పేపర్​1 జనరల్​ నాలెడ్జ్​ అయితే పేపర్​2 సెక్రటేరియట్​ ఎబిలిటీస్​ ఉంటాయి. ఇందులో రెండో పేపర్​ జాబ్​ డిసైడింగ్​ ఫ్యాక్టర్​ అవుతుంది. 

డీఏవో, ఏఈఈ, జేఎల్​ కొలువులు

ఏఈఈ పరీక్షకు కేవలం ఇంజినీరింగ్​ అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు. ఇందులో జీఎస్​ 150 మార్కులు అందరికి కామన్​గా ఉంటుంది. కాని 300 మార్కులకు ఆయా సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. సబ్జెక్టు మీద మంచి పట్టుంటే ఈ కొలువు సులువుగా కొట్టొచ్చు. జనవరి 22న ఈ పరీక్ష నిర్వహించనున్నారు. డీఏవో పరీక్ష ముఖ్యంగా మ్యాథ్స్​ అభ్యర్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో 150 మార్కులు జీఎస్​కు కేటాయిస్తే 300 మార్కులు అర్థమెటిక్​ అండ్​ రీజనింగ్​, ప్యూర్​ మ్యాథ్స్​ టాపిక్​ నుంచి అడుగుతారు. ఎవరైతే బ్యాంక్, ఎస్​ఎస్​సీ, ఎస్​ఐ జాబ్స్​కు ప్రిపేర్​ అవుతున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. డీఏవో ఎగ్జామ్​ ఫిబ్రవరి 26న నిర్వహించనున్నారు. జేఎల్​ కూడా అందరికి కామన్​గా జీఎస్​ పేపర్​ ఉంటుంది. రెండో పేపర్​లో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యంగా ఈ పరీక్షలు గమనిస్తే అన్నింటిలో జనరల్​ స్టడీస్​ సబ్జెక్ట్​ కామన్​గా ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్​ చేయాలి. జీఎస్​తో పాటు మ్యాథ్స్​ వచ్చిన అభ్యర్థులకు గ్రూప్స్​తో పాటు డీఏవో, ఎస్​ఐ, కానిస్టేబుల్​ పరీక్షలో విజయం సాధించడం సులువుగా ఉంటుంది.

-పృథ్వీ కుమార్​ చౌహాన్​
పృథ్వీస్​ IAS స్టడీ సర్కిల్​