
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో అక్రమాలు అడ్డుకోండి
సీఈవోకు టీఎస్‌యూటీఎఫ్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ ఓటర్ల నమో దులో అక్రమాలను నివారించాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని టీఎస్ యూటీఎఫ్ కోరింది. ఈ మేరకు బుధవారం సీఈవో వికాస్ రాజ్ ను యూటీఎఫ్రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి కలిసి ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటర్ల నమో దులో అవకతవకలు జరుగుతున్నట్లు టీఎస్ యూటీఎఫ్ నేతలు ఆరోపించారు. ప్రైవేటు టీచర్ల సర్వీసు వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించకుండానే అధికారులు కౌంటర్ సిగ్నేచర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా తర్వాత నియామకం అయిన జూనియర్ టీచర్ల( ఏ విద్యాసంస్థలోనూ పనిచేసిన అనుభవం లేకున్నా)మూడు నెలల పే స్లిప్స్ ఆధారంగా సర్వీస్ సర్టిఫికెట్లపై కౌంటర్ సిగ్నేచర్ చేస్తున్నారని ఆరోపిం చారు. ఈసీ మార్గదర్శకాలకు భిన్నంగా రంగారెడ్డి డీఈఓ ఇచ్చిన ఉత్తర్వులు బోగస్ ఓట్ల నమోదుకు చాన్స్ ఇస్తున్నదని చెప్పారు. ఆ ఉత్తర్వులు రద్దు చేసి, డీఈవోపై చర్య తీసుకోవాలన్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు నడుస్తున్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పనిచేసే టీచర్లు ఓటర్లు నమోదుకు అర్హులో కాదో స్పష్టత ఇవ్వాలని కోరారు.