ఆకలి తీర్చే అక్షయపాత్ర: మహాయజ్ఞంలా అన్నప్రసాదం

ఆకలి తీర్చే అక్షయపాత్ర: మహాయజ్ఞంలా అన్నప్రసాదం

జగాన్ని పాలించే జగత్‌‌కల్యాణ చక్రవర్తి వేంకటేశ్వరుడు. భక్తుల కోర్కెలు తీర్చడమే కాదు, తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు. అవును ఆ దేవదేవుడు ఆదేశించినట్టుగా ప్రతిరోజూ తిరుమలలో అన్నప్రసాదం పెడుతున్నారు. ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా సాగుతోంది. ప్రతి రోజూ లక్షల మందికి అన్నం పెడుతున్నారు. చంటి బిడ్డలకు వేడి పాల నుంచి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, అర్ధరాత్రి వరకు షడ్రషోపేత రుచులతో భోజనం పెడుతున్నారు.

వెలుగు, తిరుమల టీటీడీ భక్తులకు అనేక సేవలు అందిస్తోంది. వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల కడుపు నింపుతోంది. 1985, ఏప్రిల్ 6వ తేదీన మొదలుపెట్టిన ఈ నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇప్పటికీ సాగుతోంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద అన్న ప్రసాద వితరణ కేంద్రం. దీన్ని ముందుగా ఒక స్కీముగా మొదలుపెట్టారు. అయితే.. 19 94 తర్వాత ఇది ట్రస్టుగా మారింది. అంతేకాదు ఈ ట్రస్టుకు స్వయం ప్రతిపత్తి హోదా కూడా ఉంది. మొదట్లో ఎల్వీ. రామయ్య అనే భక్తుడు 10 లక్షల రూపాయలు అన్నదానం కోసం విరాళం ఇచ్చారు. అప్పట్లో రోజుకు రెండువేల మందికి అన్నం పెట్టేవాళ్లు. 34ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రతి రోజూ 60 వేలు, వారాంతంలో రోజుకు 70 వేల మందికి అన్నం పెడుతున్నారు. పర్వదినాల్లో అయితే రోజుకు 1.66 లక్షల మందికి అన్న ప్రసాదాలు వడ్డిస్తున్నారు. తిరుమల, తిరుపతిలోని ఆస్పత్రులు, ఇతర సంస్థలతో పాటు తిరుచానూరుతో కలిపి రోజుకు తక్కువలో తక్కువ 1.66 లక్షల నుంచి 2.24 లక్షల వరకు అన్నం పెడుతున్నారు.

1,134 కోట్ల విరాళాలు

టీటీడీ నిర్వహించే ట్రస్టుల విరాళాల సేకరణలో అన్నప్రసాద విభాగం టాప్​లో ఉంది. ఈ ట్రస్టుకు సుమారు 4.5 లక్షల మంది దాతలున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ నాటికి అన్నప్రసాద విభాగంలో మొత్తం 11,34.59 కోట్ల విరాళాలు ఉన్నాయి. భక్తులు ఈ ట్రస్టుకు ఇచ్చే విరాళాలను టీటీడీ ఎప్పటికప్పుడు బ్యాంకులో ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్‌‌ చేస్తుంది. దానిపై వచ్చే వడ్డీతో అన్నప్రసాదం పెడుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 60 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. మరో 40 నుంచి 50 కోట్ల రూపాయలు గ్రాంటు రూపంలో కేటాయిస్తుంది. అంటే సంవత్సరానికి అయ్యే ఖర్చు 100 కోట్ల పైమాటే.

దాతలకు పన్ను మినహాయింపు

టీటీడీ అన్నప్రసాద విభాగానికి విరాళాలు ఇచ్చే దాతలకు కొంత పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం 80(జీ) పన్ను మినహాయింపు అందుతుంది. అంతేకాదు లక్ష రూపాయల కంటే ఎక్కువ విరాళం ఇచ్చే దాతలకు తిరుమలలో బస, వేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనం, ఇతర బహుమానాలు ఇస్తోంది టీటీడీ.

ఒకే పంక్తిలో 4 వేల మందికి

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ నిత్యాన్నప్రసాద కేంద్రాన్ని 2008లో ఆలయానికి ఉత్తర, తూర్పు మాడ వీధుల్లో కట్టించారు. అందులో 35 కోట్ల రూపాయలతో భోజన శాల ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 4వేల మంది భక్తులు హాయిగా కూర్చుని భోజనం చేయొచ్చు. అధునాతన వంటశాల ఉంది. ఇందులో లేటెస్ట్‌‌ టెక్నాలజీతో పని చేసే కుకింగ్‌‌ ఎక్విప్‌‌మెంట్స్‌‌, ఫర్నీచర్‌‌‌‌ ఉన్నాయి. ఉదయం ఉప్మా, పొంగలి, సేమ్యా ఉప్మా, కిచిడీ, చట్నీ పెడతారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు చక్కెర/బెల్లం అన్నం, సాంబారు, రసం, చట్నీ, మజ్జిగ, వేపుడు వడ్డిస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉంటే సాంబారన్నం, పెరుగన్నం వడ్డిస్తారు.

క్యూలోని భక్తులకు

శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అందుకే వాళ్ల ఆకలి తీర్చేందుకు ఫుడ్ అందిస్తోంది టీటీడీ. చంటి బిడ్డలకు పాలు, వయసుపైబడిన వాళ్లకు కాఫీ, టీ ఇస్తోంది. అందరికీ ఉప్మా, పొంగలి పెడుతున్నారు. ఉత్తరాదివాళ్ల కోసం రోటీ, దాల్, సబ్జీ పెడతారు. టీటీడీ రోజుకు ఐదువేల రోటీలు తయారు చేస్తోంది.

మహాయజ్ఞంలా అన్నప్రసాద వితరణ

వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నాం. ఈ యజ్ఞంలో భక్తుల పాత్ర ఎంతో కీలకం. వాళ్ల సహకారంతోనే 1,134 కోట్ల రూపాయల విరాళాలు సేకరించాం. ఇప్పటికీ చాలామంది విరాళాలు ఇస్తూనే ఉన్నారు. భక్తుల ఆకలి తీర్చే ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచేవాళ్లకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి.

– ఏవీ ధర్మారెడ్డి, అదనపు ఈవో, టీటీడీ