సరుకుల నాణ్యతపై టీటీడీ ఫోకస్.. క్వాలిటీ పరిశీలనకు కొత్త యంత్రాలు...

సరుకుల నాణ్యతపై టీటీడీ ఫోకస్.. క్వాలిటీ పరిశీలనకు కొత్త యంత్రాలు...

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం కోసం వాడే సరుకుల నాణ్యత విషయంలో టీటీడీ నిబద్దత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వామి వారి సన్నిధిలో వినియోగించే సరుకుల నాణ్యతపై మరింత ఫోకస్ పెట్టింది టీటీడీ. సరుకుల నాణ్యత పరిశీలన కోసం వంద శాతం క్వాలిటీ వచ్చేలా జాగ్రత్తలు చేపట్టింది టీటీడీ. ఇందుకోసం మరో రెండు కొత్త యంత్రాలను ఏర్పాటు చేసింది టీటీడీ.ఈ యంత్రాలను తిరుమల శ్రీవారి ఆలయ వెనుక వైపు సరుకులను ఆలయంలో లోపలికి పంపే నిచ్చెనల ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 

ఈ యంత్రాల ద్వారా టిటిడి కొనుగోలు చేసిన సరుకులను చివరిగా పరిశీలిస్తారు. అనంతరం ఆలయంలోపల గల పోటు వంటశాల ప్రాంతానికి పంపిస్తారు.వందల కోట్ల రూపాయలు వెచ్చించి వేల బస్తాల ముడి సరుకులను కొనుగోలు చేస్తుంది టిటిడి.  పప్పు దినుసులు, ధాన్యం, జీడిపప్పు, బాదంపప్పు, తదితర ముడి సరుకులు క్వాలిటీ పరిశీలన అనంతరం కూడా కల్తీ జరిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో వినియోగించే ముందు కూడా చివరిగా పూర్తిస్థాయిలో సరుకులను తనిఖీ చేసేందుకు కొత్త యంత్రాలను ఏర్పాటు చేసింది టీటీడీ.

Also Read : తిరుమల శ్రీవారి దర్శనంపై సరికొత్త వివాదం

లడ్డు ప్రసాదాలు, అన్నప్రసాదాలు, అన్నదానానికి కావలసిన బియ్యం, పప్పు దినుసులు తదితర వస్తువులన్నీ టీటీడీ టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్లో సరుకుల నాణ్యత పరిశీలన చేసి వాటిని బస్తాల్లో నింపి లారీల ద్వారా తిరుమలకు తరలిస్తారు. అయితే.. అక్కడ కూడా కనుక్కోలేని సరుకుల కల్తీని గుర్తించేందుకు కొత్త యంత్రాలను ఏర్పాటు చేసింది టీటీడీ.
 
తిరుమలకు వచ్చిన పప్పు దినుసులు, బియ్యం వంటి చాలా రకాల పదార్థాలను అందులో రాళ్లు, ఇసక వంటి వ్యర్థ పదార్థాలు ఏవైనా కలిసి ఉంటే ఈ యంత్రాలు వేరు చేస్తాయని తెలిపారు అధికారులు.‌ ఈ యంత్రాలు ఒక్కోటి సుమారు రూ. 30 లక్షల విలువ చేస్తాయని..  తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన ఓ సంస్థ ద్వారా ఈ యంత్రాలని ఏర్పాటు చేసినట్లు తెలిపింది టీటీడీ.