పారిస్: ఫ్రాన్స్‌లోని నీస్ సిటీలో దుండగుడు దారుణానికి పాల్పడ్డాడు. ‘అల్లా హూ అక్బర్’ అంటూ కేకలు వేస్తూ చర్చిలోకి వచ్చి ఒక మహిళ తల నరికి, మరో ఇద్దర్ని పొడిచి చంపాడు. నోట్రడామ్ చర్చిలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అతడు ‘అల్లా హూ అక్బర్’ అంటూ కేకలు వేస్తూనే ఉన్నాడని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అదుపులోకి తీసుకునే టైంలో అతడిపై కాల్పులు జరపడంతో గాయాలయ్యాయని, హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. దాడిపై నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసి స్పందించారు. ఇది టెర్రర్ ఎటాక్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. టెర్రర్ ఎటాక్ అవునా కాదా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చనిపోయిన మహిళను చర్చి వార్డెన్‌గా గుర్తించామని ఎస్ట్రోసి చెప్పారు. “జరిగింది ఇక చాలు. ఇస్లామ్ ఫాసిజాన్ని రూపుమాపేందుకు ఫ్రాన్స్ తన శాంతి చట్టాల నుంచి బయటపడాల్సిన సమయం వచ్చింది” అని ఎస్ట్రోసి ట్వీట్ చేశారు. అక్టోబర్ మొదటి వారంలో పారిస్‌లో శామ్యూల్ అనే స్కూల్ టీచర్ తలను నరికిన సంఘటన మరిచిపోకముందే ఇలా జరగడంతో ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. పాఠం చెప్తున్నప్పుడు మహ్మద్ ప్రవక్త కార్టూన్లను చూపించినందుకు చెచెన్ సంతతికి చెందిన ఒక యువకుడు ఆ దారుణానికి పాల్పడ్డాడు.
దాడిని ఖండించిన మోడీ
ఫ్రాన్స్‌లోని నీస్ సిటీ చర్చిలో జరిగిన దాడిని మన ప్రధాని మోడీ ఖండించారు. దాడిలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టెర్రరిజంపై పోరులో ఇండియా ఎప్పుడూ ఫ్రాన్స్‌కు మద్దతుగా ఉంటుందని అన్నారు.
