
‘కరోనా’ కోట్లాదిమందిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. సినిమా, టీవీ ఇండస్ట్రీ కూడా దీనికి మినహాయింపు కాదు. చాలా మంది నటులు, టెక్నీషియన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. టీవీ ఇండస్ట్రీలో కొంతమంది సంపాదన ఎక్కువే ఉన్నా, వాళ్ల లైఫ్‌స్టైల్ కూడా దానికి తగ్గట్లే ఉంటుంది. దీంతో సేవింగ్స్ తక్కువ. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆఫర్‌తో ఆదాయం వస్తుంది. కాబట్టి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడిచేది. కానీ, ‘లాక్‌డౌన్’ వల్ల కొంతకాలం నుంచి షూటింగ్స్ లేకపోవడంతో కొంతమంది టీవీ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ ఇబ్బంది పడుతున్నారు. వీళ్లలో హిందీ, మరాఠి వంటి ఇండస్ట్రీలకు చెందిన కొందరు తమ అనుభవాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
‘పియా ఆల్బెలా, దాది అమ్మా మన్ జావో’ సీరియల్స్ ఫేమ్ షీన్ దాస్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది. ‘‘ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీతో కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నా. ఢిల్లీలో ఉన్న సొంత ఇంటిని అద్దెకు ఇచ్చాం. అక్కడివాళ్లు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెంట్ ఇవ్వలేమన్నారు. దీనికి ఒప్పుకొన్నాం. కానీ, ఇక్కడ మేం అద్దెకుంటున్న ఓనర్‌ను కూడా ఇలాగే అడిగితే, ఆయన దీనికి ఒప్పుకోలేదు. ప్రస్తుతం రెంట్ కట్టేందుకు ఇబ్బందిగా ఉంది. షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఎదురు చూస్తున్నా” అని చెప్పింది. ‘‘ఎన్ని ఇబ్బందులు ఉన్నా సమయానికి రెంట్ కట్టాల్సిందే అని మా ఓనర్ చెప్పారు” అని చెప్పింది ‘శాస్ట్రి సిస్టర్స్’ నటి సోనాలి వెంగెలేకర్. ‘రెంట్ కట్టలేకపోవడంతో ఇల్లు ఖాళీ చేసే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ముంబైలోని కొందరు ఫ్రెండ్స్. మా దగ్గర కొన్ని డబ్బులున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఓ.కే. కానీ, ఆ తర్వాత..? అహ్మదాబాద్‌లో ఉన్న సొంత ఇంటికి వెళ్లి, అక్కడ అద్దెకుంటున్న వాళ్లను మేం కూడా ఖాళీ చేయించగలం. కానీ, వాళ్లెక్కడికెళ్తారు. ఇప్పుడున్న పరిస్థితిని కొందరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో’ అంటూ బాధపడ్డాడు నటుడు మల్హర్ పాండ్యా. ‘కసమ్ తేరే ప్యార్ కి’ వంటి సీరియల్స్‌లో నటించాడు మల్హర్. మరో నటి హర్షితా గౌర్ కూడా రెంట్ విషయంలో ఇబ్బంది పడుతున్నట్లు, అయితే వాయిదాల పద్ధతిలో రెంట్ కట్టేందుకు తమ ఓనర్ ఒప్పుకున్నట్లు చెప్పింది. ‘బెగుసరై, సీఐడీ’ వంటి టీవీ షోస్‌తోపాటు అగ్నిపథ్, మంగళ్‌పాండే వంటి సినిమాల్లో నటించిన రాజేష్ కరీర్ తన ఆర్థిక ఇబ్బందుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సొంత ఊరికి వెళ్లేందుకు డబ్బులు కావాలని రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఆయనకు చాలా మంది సాయం చేశారు. డబ్బులు ఆన్‌లైన్‌లో వేశారు. అందుకు అందరికీ థ్యాంక్స్చెప్పాడు రాజేశ్.