కిచ్చా సుదీప్, అజయ్ దేవ్ గణ్ మధ్య ట్వీట్ వార్

కిచ్చా సుదీప్,  అజయ్ దేవ్ గణ్ మధ్య ట్వీట్ వార్

హిందీ చిత్ర పరిశ్రమపై కన్నడ నటుడు కిచ్చా సుదీప్ చేసిన కామెంట్స్ పై అజయ్ దేవ్ గణ్ తన దైన స్టైల్లో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సుదీప్ ను ప్రశ్నించారు. ‘‘ సోదరా..మీ ఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీ సినిమాలను హిందీ భాషలో డబ్ చేసి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ? హిందీ భాష ఎప్పటికీ జాతీయ భాషే అవుతుంది. జనగన మణ’ అంటూ ట్వీట్ చేశాడు. 

అజయ్ దేవ్ గణ్ ట్వీట్ పై కిచ్చా సుదీప్ కూడా సమాధానమిచ్చారు. ‘ అజయ్ సర్.. నేనొక రకంగా చెప్తే మీకు మరో రకంగా అర్థమైందనుకుంటా. నేను ఎవరినీ కించపరిచేందుకు అలా చేయలేదు. మన దేశ భాషలన్నింటిపైనా నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. మేము హిందీని ప్రేమించాం, గౌరవించాం, నేర్చుకున్నాం. అందుకే మీరు హిందీలో పోస్ట్ చేసిన ట్వీట్ ను నేను చదవగలిగా. అదే నా సమాధానాల్ని కన్నడలో రాస్తే పరిస్థితి ఏంటి సర్..? చదవగలరా..? అనువాదానికి, ఊహించుకోవడానికి చాలా తేడా ఉంది. ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలా జరుగుతుంటుంది. నేను మిమ్మల్ని నిందించడం లేదు. మీ నుంచి సమాధానం వచ్చినందుకు సంతోషిస్తున్నా. ఇంతటితో ఈ టాపిక్ ను ముగిద్దాం. త్వరలోనే మనం కలవాలని ఆశీస్తున్నా’ అంటూ సుదీప్ వరుస ట్వీట్స్ చేశారు. 

అంతకుముందు కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..? 

కన్నడ చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తోందని కొంతమంది అంటున్న మాటల్లో నిజం లేదని కిచ్చా సుదీప్ అన్నారు. పాన్ ఇండియా స్థాయి అని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్ని అలరించేలా సినిమాలు తీస్తున్నామని చెప్పారు. హిందీ వారే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి సినిమాలు రూపొందిస్తున్నారని చెప్పారు. తమ సినిమాలను తమిళం, తెలుగు, కన్నడ.. ఇలా దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారని, అయినా విజయాలను అందుకోలేకపోతున్నారని అన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో సుదీప్ ఈ కామెంట్స్ చేశారు. ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు.  

దేశవ్యాప్తంగా ఇప్పుడు సౌత్ సినిమాలు వరుసగా  సక్సెస్ సాధిస్తుండడం సర్వత్రా చర్చనీయంశమైంది. పుష్ప, ట్రిపుల్ ఆర్, KGF-2 భారీ విజయాలు సాధించి హిందీ సినిమాల రికార్డులను బద్దలు కొట్టడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఇప్పుడు బాలీవుడ్ అతి పెద్ద ఇండస్ట్రీ కాదనీ, సౌత్ సినిమాలే ఇండియన్ ఇండస్ట్రీని ఏలుతున్నాయనే వాదన తెరపైకి వస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ ఫైట్ నడుస్తోంది. దీనికి కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలే బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపాయి. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సుదీప్ తెలుగు, కన్నడ సినిమాలు భారీ సక్సెస్ లు సాధిస్తుంటే.. ఇక హిందీ నేషనల్ లాంగ్వెజ్ ఎలా అవుతుంది..? హిందీ మన జాతీయ భాష ఏ మాత్రం కాదు..బాలీవుడ్ వాళ్లు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తూ మన దగ్గర రిలీజ్ చేస్తున్నారు, మనమే ఇండియన్ సినిమాలు తీస్తున్నాం’ అంటూ వ్యాఖ్యానించాడు. దీనికి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు. 

మరిన్ని వార్తల కోసం..

చైనీయుల ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంటాం

పెట్రో ధరలు రాష్ట్రాలే తగ్గించాలన్న మోడీపై కాంగ్రెస్ ఫైర్