
- సోషల్ మీడియాలో వైరలైన మరో మహిళా ఖైదీ ఆడియో
- వరంగల్ జిల్లా నర్సంపేటలో దళిత సంఘాల ఆందోళన
వరంగల్/నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ సబ్ జైలులో మహిళా రిమాండ్ ఖైదీ మృతి ఘటనలో విడుదలైన మరో మహిళా ఖైదీ ఆడియో కలకలం రేపింది. నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36)పై ఈనెల 13న సుబేదారి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో నర్సంపేట జైలుకు రిమాండ్ కు పంపారు. గురువారం ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది.
కాగా, జైలు సిబ్బంది దాడి కారణంగానే అక్క చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె సోదరుడు పుట్ట సంతోష్ నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. జైలు నుంచి విడుదలైన మరో మహిళా ఖైదీ ఫోన్‍లో బంధువులతో మాట్లాడిన ఆడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ‘‘ సుచరిత కడుపు నొప్పితో బాధపడగా.. జైలు అధికారిణి పట్టించుకోకుండా.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. సూటిపోటీ మాటలతో అవమానించడంతో పాటు బకెట్లతో చల్లటి నీటిని పోయించి ఫిట్స్ వచ్చేలా చేసింది.
ఆపై కనికరం చూపకుండా లాఠీతో తీవ్రంగా కొట్టడంతోనే సుచరిత ప్రాణాలు విడిచింది. తోటి ఖైదీలు చెప్పడంతో ఆస్పత్రికి తరలించి కడుపునొప్పితో చనిపోయినట్టు తెలిపింది”అని పేర్కొంది. దీంతో సుచరిత మృతిపై దళిత సంఘాలు శుక్రవారం రాస్తారోకో చేపట్టాయి. సబ్ జైలర్ కొట్టిన దెబ్బలకే చనిపోయిందని ఆరోపించాయి. బాధిత కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పోలీసులతో పాటు తహసీల్దార్ రవిచంద్రారెడ్డి ఎమ్మార్పీఎస్ నేతలతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా.. సుచరిత డెడ్‌బాడీకి ఆర్డీఓ ఉమారాణి, హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో డాక్టర్లు పోస్టుమార్టం చేశారు. అనంతరం సుచరిత అంత్యక్రియలు ముగిశాయి.
నేను కొట్టలేదు : సబ్ జైలర్ లక్ష్మి శృతి
రిమాండ్ మహిళా ఖైదీ సుచరితను సకాలం లో ఆస్పత్రికి తీసుకెళ్లామని, ట్రీట్ మెంట్ తీసుకుంటూ గురువారం ఉదయం చనిపోయింది. నేను ఆమెను కొట్టలేదు. జైల్ నుంచి విడుదలైన ఖైదీల్లో నేనంటే పడనివారు, సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేస్తున్నారు. పోస్టుమార్టంలో అన్నీ తెలుస్తాయి.