
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తన ఉద్యోగుల వర్క్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ను ఇంటి నుంచే శాశ్వతంగా పని చేసుకునేందుకు అనుమతిస్తామని ట్విట్టర్ తెలిపింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సెప్టెంబర్ లోగా తమ ఆఫీస్ లు తెరిచేందుకు వీలు లేదని పేర్కొంది. కరోనా కారణంగా టెలీవర్క్ కు మూవ్ అయిన తొలి కంపెనీ తమదేనని చెప్పింది. వర్క్ ఫోర్స్ కు ఇబ్బంది లేకుండా తమ ఉద్యోగులను ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకునేలా వీలు కల్పించామని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు.
‘గడిచిన కొన్ని నెలలు ఇంటి నుంచి కూడా పని చేయొచ్చని రుజువు చేశాయి. ఒకవేళ మా ఎంప్లాయీస్ ఇంటి దగ్గర నుంచి శాశ్వతంగా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటే అందుకు మేం అనుమతిస్తాం. కార్యాలయాలు ఎప్పుడు తెరవాలన్నది మా నిర్ణయం. ఉద్యోగులు ఎప్పుడు తిరిగివస్తే అప్పుడు ఆఫీస్ వారిదే అవుతుంది. కొన్ని మినహాయింపుల మధ్య సెప్టెంబర్ లోపు ఆఫీసులు తిరిగి తెరుచుకునే అవకాశం లేదు. ఎప్పుడైతే ఆఫీసులు తెరవాలని మేం నిర్ణయించుకుంటామో అప్పుడు ఇంతకుముందులా మాత్రం ఉండబోదు’ అని ట్విట్టర్ పేర్కొంది. కాగా, ఈ ఏడాది ఆఖరు వరకు తమ ఎంప్లాయీస్ ను టెలీవర్క్ తోనే కంటిన్యూ చేయాలని గూగుల్, ఫేస్ బుక్ నిర్ణయించాయని సమాచారం.