భర్తను కాల్చేసిన్రు..భార్యను బొంద పెట్టిన్రు

భర్తను కాల్చేసిన్రు..భార్యను బొంద పెట్టిన్రు
  • భార్యాభర్తల మర్డర్​ కేసులో ఇద్దరు అరెస్ట్
  • భర్తను కాల్చేసిన్రు..భార్యను బొంద పెట్టిన్రు
  • శ్మశానవాటిక కోసం తవ్వుతుంటే బయటపడ్డ 
  • డెడ్​బాడీ చీర ఆనవాళ్లతో మృతురాలి గుర్తింపు
  • పోలీసుల ముందు లొంగిపోయిన నిందితులు

దేవరకద్ర, వెలుగు : ఎనిమిదేండ్ల కింద భార్యాభర్తలను చంపిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​చేశారు. మహబూబ్​నగర్​జిల్లా భూత్పూర్ సీఐ రజిత కథనం ప్రకారం.. దేవరకద్ర మండలం ఇస్రంపల్లికి చెందిన ఎండీ బురాన్​తన అత్తగారి ఊరైన పేరూరులో భార్య ఫాతిమాతో కలిసి ఉంటున్నాడు. బావమర్దులు నానేశ్, మహ్మద్ రఫీతో కలిసి కట్టెలు కాల్చి బొగ్గుగా చేసి అమ్మే వ్యాపారం చేసేవాడు. ఇదే ఊరికి చెందిన బోయ ఆంజనేయులు, ఇతడి భార్య శాంతమ్మ కట్టెలు కొట్టుకొని వచ్చి వీరికి అమ్మేవారు. ఈ క్రమంలో బురాన్, ఆంజనేయులు స్నేహితులయ్యారు. దీంతో ఆంజనేయులుకు రూ.20 వేలు అప్పు ఇచ్చాడు. అప్పు పేరుతో బురాన్ తరచూ ఆంజనేయులు ఇంటికి వెళ్లి శాంతమ్మతో మాట్లాడేవాడు. దీంతో ఆంజనేయులు.. బురాన్​ను మందలించాడు. కానీ, బురాన్ తన బావమర్దుల దగ్గరకు వెళ్లి ఆంజనేయులును తన అప్పు తీర్చమని అడిగితే నిందలు వేస్తున్నాడని చెప్పాడు. దీంతో వారు ఏప్రిల్ 4, 2014లో ప్రస్తుత వనపర్తి జిల్లా పెద్దమునగాలచెడుకు తీసుకువెళ్లి చంపేశారు. తర్వాత శవంపై బట్టలు వేసి కాల్చారు. అదే రోజు రాత్రి ముగ్గురూ సైకిళ్లపై పేరూరుకు వచ్చి శాంతమ్మను ఊరి శివారులోని పెద్ద చెరువు దగ్గరకు తీసుకువెళ్లి చీరతో ఉరి వేసి హత్య చేశారు. తర్వాత అక్కడే శవాన్ని పాతిపెట్టారు. మరుసటి రోజు నుంచి భార్యాభర్తలు కనిపించకపోవడంతో గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లిపోయారని అనుకున్నారు.

ఆంజనేయులు, శాంతమ్మలకు 15 ఏండ్ల కొడుకు శ్రీకాంత్​ఉండగా అతడి పోషణభారం బంధువులు తీసుకున్నారు. భార్యాభర్తలు కనిపించడం లేదని పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 17, 2020లో పేరూరులో శ్మశానవాటిక కోసం జేసీబీతో భూమిని చదును చేస్తుండగా ఎముకలు బయటపడ్డాయి. చీర కనిపించడంతో అది మహిళదని నిర్ధారించుకుని గ్రామంలో విచారణ చేయగా అది శాంతమ్మదని తేలింది. డీఎన్​ఏ టెస్టుకు పంపించగా శాంతమ్మ మృతదేహమని రిపోర్టు వచ్చింది. అప్పటి పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్18న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఏమీ తేల్చలేకపోయారు. ఆంజనేయులు, ఆయన భార్యను తామే హత్య చేసినట్లు బురాన్, నానేశ్​శుక్రవారం సర్పంచ్ వద్ద ఒప్పుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపర్చి జిల్లా జైలుకు తరలించారు. హత్యలతో సంబంధమున్న మూడో వ్యక్తి మహ్మద్ రఫీ కొన్ని నెలల కింద అనారోగ్యంతో చనిపోయాడని పోలీసులు చెప్పారు.