జమ్మూలో పావుగంటలో రెండు పేలుళ్లు

జమ్మూలో పావుగంటలో రెండు పేలుళ్లు
  • 9 మందికి గాయాలు
  • రాహుల్ యాత్ర, రిపబ్లిక్ డేతో హైఅలర్ట్ 

జమ్మూ: జమ్మూలో శనివారం ఒకే ప్రాంతంలో వరుసగా రెండు పేలుళ్లు జరిగాయి. పావుగంట తేడాతో ఒకదాని తర్వాత ఒకటి రెండు కార్లు పేలిపోయాయి. ఈ పేలుళ్లలో 9 మందికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ యాత్ర జమ్మూలోకి ఎంటర్ కానున్న టైమ్ లో పేలుళ్లు జరగడంతో ఆందోళన నెలకొంది. జమ్మూ సిటీ శివారు నార్వాల్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయని అడిషనల్ డీజీ ముఖేశ్ సింగ్ తెలిపారు. ‘‘ఉదయం 11 గంటల ప్రాంతంలో రిపేర్ షాప్ దగ్గర పార్క్ చేసిన పాత బొలెరో వెహికల్ లో పేలుడు సంభవించింది. సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఆ ఏరియాను క్లియర్ చేశారు. అయితే 15 నిమిషాల తర్వాత అక్కడికి 50 మీటర్ల దూరంలోనే డంపింగ్ యార్డు దగ్గర పార్క్ చేసిన మరో వెహికల్ లో పేలుడు జరిగింది. ఈ రెండు ఘటనల్లో 9 మంది గాయపడ్డారు. వాళ్లందరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నాం” అని చెప్పారు. సీఆర్పీఎఫ్, స్పెషల్ టీమ్స్ తో ఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ చేస్తున్నామని.. ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్స్ ను రప్పించామని వెల్లడించారు. పేలుళ్లకు కారణాలు ఇంకా తెలియలేదన్నారు. ఇది టెర్రరిస్టుల పనేనని, పేలుళ్లకు ఐఈడీలు వాడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్ యాత్రతో పాటు రిపబ్లిక్ డేకు ముందు పేలుళ్లు జరగడంతో అప్రమత్తమయ్యారు. కాగా, రాహుల్ యాత్ర ప్రస్తుతం జమ్మూకు 70 కిలోమీటర్ల దూరంలోని చద్వాల్ లో కొనసాగుతోంది. ఈ నెల 23న జమ్మూలోకి ఎంటర్ కానుంది. 

ఖండించిన ఎల్జీ.. 

పేలుళ్ల ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. నేరస్తులను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడినోళ్లకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని, అవసరమైన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.