తొగుట/కౌడిపల్లి, వెలుగు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసన్ పల్లి మధిర గ్రామానికి చెందిన నాంచర్ పల్లి రవి(37) తనకున్న ఎకరా భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. సాగు పెట్టుబడికి, కొత్త ఇంటి నిర్మాణానికి, కుటుంబ అవసరాలకు సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు. పంటలు పండక, అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. స్థానికులు సిద్దిపేటలోని ప్రభుత్వాస్పత్రికి రవిని తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతునికి భార్య రేణు, నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామానికి చెందిన గుడాల ఎల్లయ్య (45) తనకున్న ఎకరం పొలాన్ని సాగు చేసేందుకు గతంలో 8 బోర్లు వేయగా, ఏ ఒక్కదాంట్లో నీళ్లు పడలేదు. బోర్ల తవ్వకానికి రూ.6 లక్షలకు పైగా ఖర్చయింది. కుటుంబ అవసరాలకు, సోదరి పెళ్లికి మరో రూ.4 లక్షలు అప్పు చేశా డు. దీంతో కొన్నేండ్ల కిందట బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. సూరారంలో ఉంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని రోజూ ఇంట్లో చెబుతూ బాధపడేవాడు. దీంతో సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఎల్లయ్య మృతి చెందాడు. మృతునికి భార్య, కొడుకు, కూతు రు ఉన్నారు. మృతదేహాన్ని కంచన్పల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.