మిర్యాలగూడలో అధిక వడ్డీ ఆశ చూపి .. మోసం చేసిన నిందితుల అరెస్టు

మిర్యాలగూడలో అధిక వడ్డీ ఆశ చూపి .. మోసం చేసిన నిందితుల అరెస్టు
  • రూ. 32 లక్షల వరకు వసూలు 

మిర్యాలగూడ, వెలుగు: అధిక వడ్డీ పేరుతో డబ్బులు డిపాజిట్ చేసుకొని మోసం చేసిన ఇద్దరు నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాతో మాట్లాడుతూ..  మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డుకి చెందిన బండి సంధ్య, సుందర్ నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన అవిరెండ్ల అఖిల్ కొంతకాలంగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ. 32 లక్షలు వసూలు చేశారు. డబ్బును తన సొంత అవసరాలకు ఉపయోగించుకొని బాధితులకు ఇవ్వకుండా మోసం చేశారు. 

 బాధితులు ఒత్తిడి చేయడంతో ఫ్రెండ్స్ లక్కీ డ్రా పేరుతో మరొక కొత్త స్కీమ్‌‌‌‌ను తీసుకువచ్చి నెలకు రూ. 1000 చొప్పున జమ చేస్తే విలువైన బహుమతులు అందజేస్తామని నమ్మ బలికారు. ఉద్దేశపూర్వకంగా అమాయకులకు అధిక వడ్డీ చూపి మోసం చేసినందుకు బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌‌‌‌లో  ఫిర్యాదు చేయాలని కోరారు.  సమావేశంలో సీఐలు సోమ నరసయ్య, మోతీరామ్, ఎస్ఐ సైదిరెడ్డి పాల్గొన్నారు.