మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలో బిల్డింగ్‌‌ కూలి ఇద్దరు మృతి

మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలో బిల్డింగ్‌‌ కూలి ఇద్దరు మృతి
  • పాత భవనానికి రిపేర్లు చేస్తుండగా కూలిన గోడలు, స్లాబ్‌‌
  • మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కేంద్రంలో ఘటన

మహబూబ్‌‌నగర్‌‌ అర్బన్‌‌, వెలుగు : పాత బిల్డింగ్‌‌కు రిపేర్లు చేస్తున్న క్రమంలో గోడ, పైకప్పు కూలి ఇద్దరు కూలీలు చనిపోయారు. ఈ ఘటన మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నంం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని పాతతోట ప్రాంతానికి చెందిన సంపు లక్ష్మణ్‌‌ తన పాత ఇంటికి రిపేర్లు చేపట్టారు. ఈ పని కోసం గురువారం నవాబుపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన గద్వాల కృష్ణయ్య (45), భూత్పూర్‌‌ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌‌ గ్రామానికి చెందిన కుమ్మరి శాంతయ్య (60) వచ్చారు. 

రిపేర్లు చేయడానికి ముందు ఇంటిని ఆనుకొని ఉన్న రావి చెట్టును తొలగించాలని లక్ష్మణ్‌‌ సూచించాడు. దీంతో కృష్ణయ్య, శాంతయ్యతో పాటు మరో ఇద్దరు కలిసి చెట్టును కూల్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చెట్టుకు తాళ్లను కట్టి లాగుతుండగా.. ఇంటి గోడలతో పాటు పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. గమనించిన మిగతా ఇద్దరు బయటకు పరిగెత్తగా.. కృష్ణయ్య, శాంతయ్యపై శిథిలాలు పడడంతో అక్కడికక్కడే చనిపోయారు. 

స్థానికులు ఫైర్, మున్సిపల్, పోలీస్‌‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని సుమారు ఆరు గంటల శ్రమించి ఇద్దరి డెడ్‌‌బాడీలను బయటకు తీశారు. బిల్డింగ్‌‌ ఓనర్‌‌ లక్ష్మణ్‌‌పై కేసు నమోదు చేసినట్లు వన్‌‌టౌన్‌‌ పోలీసులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి, కలెక్టర్‌‌ విజయేందిర బోయి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.