కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి ..మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఘటనలు

కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి ..మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఘటనలు

తొర్రూరు, వెలుగు: : విద్యుత్ షాక్‌‌తో రిక్షా కార్మికుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..  తొర్రూరు టౌన్ లోని అంబేద్కర్ నగర్‌‌కు చెందిన మంగళపల్లి పెంటయ్య(60) రిక్షా కార్మికుడు. కాగా.. ఈనెల 9న అన్నారం రోడ్డులో చనిపోయిన మహిళ ఇంటి ముందు పెంటయ్య టెంట్ వేశాడు. దాన్ని తొలగించేందుకు ఇంటి పైకి ఎక్కి తాడు విప్పుతున్నాడు. పైనుంచే వెళ్లే11 కెవీ విద్యుత్ తీగ తగలడంతో అతడు 80 శాతం మేర కాలిపోయాడు . 

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెంటయ్య కొడుకు యాకేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉపేందర్ తెలిపారు.

ఐరన్ పట్టి బిగిస్తుండగా మరొకరు..

ఖిలా వరంగల్(మామునూర్) : వరంగల్ జిల్లాలో కరెంటు షాక్ కొట్టి ఒకరు చనిపోయారు. మామునూర్ సీఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మార్కండేయనగర్ కు చెందిన జాటోత్ నాగేశ్వరరావు(41), నక్కలపల్లిలోని భార్గవి రైస్ మిల్ హెల్పర్. కాగా..మంగళవారం డ్యూటీకి వెళ్లాడు. మిల్లులో పని లేకపోవడంతో మరో ప్రాంతంలోని గౌరీశంకర్ రైస్ మిల్లులోకి పనికి వెళ్లాడు. ఐరన్ పట్టి బిగిస్తుండగా కరెంట్ షాక్ కొట్టడడంతో నాగేశ్వరరావు కిందపడ్డాడు. వెంటనే 108లో  ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణవేణి తెలిపారు.