సూర్యాపేట గోల్డ్ చోరీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

సూర్యాపేట గోల్డ్ చోరీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
  • పశ్చిమబెంగాల్‌‌లో ఒకరు, ఖమ్మంలో మరొకరు
  • నిందితుల వద్ద రూ.60 లక్షల విలువైన 554 గ్రాముల గోల్డ్, రూ.92,500 నగదు స్వాధీనం
  • సూర్యాపేట ఎస్పీ నరసింహ వెల్లడి

సూర్యాపేట, వెలుగు :  గత నెల 21న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో జరిగిన గోల్డ్ చోరీ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు.   నిందితుల నుంచి రూ.60 లక్షల విలువైన 554 గ్రాముల బంగారం, రూ.92,500 స్వాధీనం చేసుకున్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఎస్పీ కె.నరసింహ నిందితుల వివరాలను వెల్లడించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పశ్చిమ బెంగాల్‌‌ లోని దక్షిణ్ దినాజ్‌‌ పుర్‌‌ జిల్లా బైహోర్‌‌ గ్రామానికి చెందిన మాలిక్‌‌ మొల్లాను ఈనెల11న పోలీసులు అరెస్టు చేశారు.

 అతడి వద్ద నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన అర కిలో బంగారు ఆభరణాలు, రూ.87,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడు రోజుల కస్టడీకి అనుమతి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ పై సూర్యాపేటకు తీసుకొచ్చారు. నేపాల్‌‌కు చెందిన అమర్‌‌ భట్‌‌ ను ఖమ్మం టౌన్ లో అదుపులోకి తీసుకుని రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు  ఉండగా, ముగ్గురిని అరెస్టు చేశారు.

 మరో నలుగురు ప్రకాశ్ అనిల్‌‌కుమార్, కడాక్‌‌ సింగ్, పురన్‌‌ ప్రజోషి, జషిమొద్దీన్‌‌ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. కేసులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఇన్‌‌స్పెక్టర్‌‌ వెంకటయ్య, సీసీఎస్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ శివకుమార్, ఎస్‌‌ఐలు, సిబ్బందిని అభినందించి రివార్డ్‌‌ అందజేశారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.