ఈ నెల 8న మరో రెండు గ్యారంటీలు : శ్రీధర్​బాబు

ఈ నెల 8న మరో రెండు గ్యారంటీలు : శ్రీధర్​బాబు

పలిమెల, వెలుగు: ప్రజల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తామని, గత సర్కారు లాగా వృథా చేయబోమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలలో బస చేసిన మంత్రి.. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ భవేశ్​ మిశ్రాతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక క్రమశిక్షణతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు.

రూ. 500కే గ్యాస్​ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​పథకాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ స్కీమ్​లను ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని చెప్పారు. ప్రజావాణిలో భూములు, పోడు పట్టాలు, కరెంట్ లైన్లకు సంబంధించిన సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా పలిమెల లిఫ్ట్​ను పునరుద్ధరించి సాగునీరు అందించాలని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇంజనీర్లను మంత్రి శ్రీధర్​బాబు ఆదేశించారు. మండలంలో రూ.3.5 కోట్లతో చేపట్టే పలు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పలిమెల, హనుమకొండ మధ్య ఆర్టీసీ నైట్ హాల్ట్ బస్సు ప్రారంభించి పంకెన వరకు ప్రయాణించారు. పంకెనలో కస్తూర్బా హాస్టల్ లో పదో తరగతి స్టూడెంట్లతో మాట్లాడారు.