బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రెటరీ, ఎస్‌డీపీఐ నేతల హత్య

బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రెటరీ, ఎస్‌డీపీఐ నేతల హత్య

కేరళలో పన్నెండు గంటల గ్యాప్‌లోనే ఇద్దరు రాజకీయ నేతల హత్యలు జరిగాయి. ఆ రాష్ట్రంలోని అలప్పుజలో ఈ రోజు ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రెటరీ రంజిత్ శ్రీనివాసన్‌ను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఆదివారం ఉదయం ఆయన ఇంటి దగ్గర కుటుంబసభ్యుల ఎదుటనే ఎనిమిది మంది వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి పరారయ్యారు. దీంతో హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.

అలప్పుజ జిల్లాలోనే నిన్న (శనివారం) రాత్రి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) స్టేట్ సెక్రెటరీ కేఎస్ షాన్‌ (38)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అలప్పుజ నుంచి మన్నచేరిలో ఉన్న తన ఇంటికి స్కూటీపై వెళ్తుండగా కొంత మంది కారులో వచ్చి ఢీకొట్టారు. ఆ తర్వాత కింద పడిన షాన్‌పై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఆయనను ఎర్నాకులంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ లాభం లేకపోయింది. శరీరంలో దాదాపు 40 గాయాలయ్యాయని, అతడిని ప్రాణాలతో కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు. 

ఈ రెండు ఘటనలపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇలాంటి చర్యలను తమ ప్రభుత్వం సహించదని, ఈ హత్యల వెనుక ఎవరున్నా తమ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని చెప్పారు. అయితే ఒకే జిల్లాలో రెండు రాజకీయ హత్యలు జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు 144 సెక్షన్ విధించినట్లు ఆ జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ తెలిపారు.

ఈ హత్య ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్‌ పనే: కేంద్రమంత్రి

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రెటరీ రంజిత్ మృతిపై కేంద్ర మంత్రి మురళీధరన్ విచారం వ్యక్తం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హత్య ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్‌ పనేనని అలప్పుజ నుంచి తనకు సమాచారం వస్తోందని అన్నారు. కాగా, ఎస్‌డీపీఐ నేత షాన్ హత్య వెనుక ఆర్‌‌ఎస్‌ఎస్ ఉందని పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా ఆరోపించింది. తన రాజకీయ శత్రువులు, మైనారిటీ నేతల గొంతునొక్కేందుకు ఆర్‌‌ఎస్‌ఎస్‌ పక్కా కుట్రతో ఈ హత్య చేసిందని పాపులర్ ఫ్రంట్ స్టేట్ ప్రెసిడెంట్ సీపీ మహమ్మద్ బషీర్ అన్నారు. అయితే అలప్పుజ జిల్లా ఆర్‌‌ఎస్‌ఎస్ నేతల ఈ ఆరోపణలను ఖండించారు.