గ్రేట్ రెస్క్యూ టీం: వరద నీటిలో 'పురిటి' కష్టాలు ..గర్భిణులను హాస్పిటల్స్‌‌‌‌కు తరలించారు

 గ్రేట్ రెస్క్యూ టీం: వరద నీటిలో 'పురిటి' కష్టాలు ..గర్భిణులను హాస్పిటల్స్‌‌‌‌కు తరలించారు
  • గర్భిణిలను కాపాడారు..  ఎస్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌, లోకల్‌‌‌‌ యూత్‌‌‌‌

మెదక్/రాయికల్/దుబ్బాక, వెలుగు : ఓ వైపు భారీ వర్షాలు, మరో వైపు రవాణా సదుపాయం లేక పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు గర్భిణులను ఎస్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌, స్థానిక యువత కలిసి హాస్పిటల్స్‌‌‌‌కు తరలించారు. మెదక్, జగిత్యాల జిల్లాల్లో గురువారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. 

మెదక్​ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం రాజ్‌‌‌‌పేటతండాకు చెందిన గర్భిణి మాలోత్ హరితకు గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. మెదక్‌‌‌‌ వెళ్లే మార్గంలో బూర్గుపల్లి వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో ఆస్పత్రికి వెళ్లడం ఇబ్బందిగా మారింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాహుల్‌‌‌‌రాజ్‌‌‌‌ ఎస్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ టీమ్‌‌‌‌ను అలర్ట్ చేశారు. వారి సూచన మేరకు కుటుంబసభ్యులు హరితను ఆటోలో బూర్గుపల్లి వరకు తీసుకురాగా.. ఎస్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ టీమ్‌‌‌‌ మహిళను స్ట్రెచర్‌‌‌‌పై పడుకోబెట్టి రోడ్డు దాటించారు. 

అక్కడి నుంచి అంబులెన్స్‌‌‌‌లో మెదక్ ప్రభుత్వ మాతా శిశు సంక్షరణ కేంద్రానికి తరలించారు. అలాగే, జగిత్యాల జిల్లా రాయికల్‌‌‌‌ మండలం ఒడ్డెలింగాపూర్‌‌‌‌కు చెందిన గర్భిణి కల్యాణికి పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేశారు. 

రాయికల్‌‌‌‌ మండలం రామాజీపేట, భూపతిపూర్‌‌‌‌ గ్రామాల మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో 108 వెహికల్ వాగు దాటి గ్రామానికి రాలేకపోయింది. దీంతో స్థానిక యువకులు జేసీబీ తెప్పించి గర్భిణిని, ఆమె కుటుంబసభ్యులను జేసీబీలో కూర్చోబెట్టి వాగు దాటించారు. అక్కడినుంచి ఆమెను 108 అంబులెన్స్‌‌‌‌లో రాయికల్​ఆస్పత్రికి తరలించారు.