- మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో ఘటన
హన్వాడ, వెలుగు : ఐరన్, ఆయిల్ లోడ్‌తో వెళ్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో భారీ ఎత్తున మంటలు లేచాయి. ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం కాగా, మరో వ్యక్తి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బహర గ్రామానికి చెందిన లవకుశ ప్రసాద్ మిశ్రా చెన్నై నుంచి ఐరన్ లోడ్ లారీతో పూణేకు వెళ్తున్నాడు.
అలాగే నిరంజనప్ప (36) అనే వ్యక్తి ఆయిల్ ట్యాంకర్‌తో తాండూరు నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో హన్వాడ మండలం పిల్లిగుండు తండా వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. ప్రమాదంలో నిరంజనప్ప సజీవ దహనం కాగా.. లవకుశ మిశ్రా లారీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో స్థానికులు గమనించి పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లవకుశ మిశ్రా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
