మన మంత్రులు రెండేండ్లయినంక ఎగిరివడ్తున్నరు

మన మంత్రులు రెండేండ్లయినంక ఎగిరివడ్తున్నరు

దక్షిణ తెలంగాణను ఎండబెట్టే అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు రెండేండ్ల సంది ఆంధ్రప్రదేశ్​ సర్కారు కుట్రల కత్తులు నూరుతుంటే.. మన మంత్రులు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే లేస్తున్నరు. అది చేస్తం ఇది చేస్తం అంటూ మాటలతో మస్తు ఊగిపోతున్నరు. ఇగ వీధిపోరాటాలు తప్పవని, శ్రీశైలానికి నీళ్లు రాకముందే మలుపుకొనెటట్లు కొత్త ప్రాజెక్టులు కట్టి తీరుతామని మంత్రి నిరంజన్​ రెడ్డి శపథం చేసిన్రు. హక్కుగా దక్కిన కృష్ణా నీళ్లను వాడుకోలేకపోతున్నామని, జోగులాంబ ప్రాజెక్టుకు ఎవరు అడ్డం వస్తరో చూస్తామని సవాల్​ విసిరిన్రు. మరో దిక్కు.. భూమి ఆకాశాలను ఏకం జేస్తామని, వైఎస్సార్​ దొంగ అయితే జగన్‌  గజదొంగేనని  మంత్రి పువ్వాడ అజయ్​ గరం గరమైన్రు. తాము హీరోయిజం కోసం మాట్లాడ్తలేమని, తెలంగాణ సమాజానికి సీఎం కేసీఆరే హీరో అని ఆయన చెప్పుకొచ్చిన్రు.  బైరెడ్డి బాంబులు వేస్తానంటే తాము మానవ బాంబులమైతామని, ఏపీ సీఎం జగన్​ తెలంగాణ పాలిట గాడ్సే అయ్యిండ్రని నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే  మర్రి జనార్దన్ రెడ్డి అన్నరు. ప్రాజెక్టులు కట్టనీకి ఏపీ జీవోలు ఇచ్చినప్పుడు, పనులు స్టార్ట్​ చేసినప్పుడు ఎందుకు సైలెంట్​గా ఉన్నారన్న దానిపై మాత్రం వీళ్ల నుంచి సమాధానం లేదు. 

హక్కుగా దక్కిన కృష్ణా నీళ్లను వాడుకోలేకపోతున్నం
మేం ఎన్జీటీకి వెళ్లలే.. ఇంప్లీడ్‌‌ అయినం: మంత్రి నిరంజన్‌‌ రెడ్డి

ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై వీధి పోరాటాలు చేస్తామని మంత్రి నిరంజన్‌‌ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన కృష్ణా నీళ్లను వాడుకోలేకపోతున్నామని, అందుకే జోగులాంబ బ్యారేజీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. శనివారం మినిస్టర్స్‌‌ క్వార్టర్స్‌‌లోని తన నివాసంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య పాలకులు మంచినీళ్ల కోసమంటూ తెలుగు గంగ ప్రాజెక్టుతో మొదలు పెట్టి దక్షిణ తెలంగాణను నిండా ముంచారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ భారీగా పెంచి అక్రమంగా నీటిని తీసుకెళ్తున్నారని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకారంతో వనరులను ఉపయోగించుకుందామని ఏపీకి స్నేహహస్తం అందించామని, ముందు సానులకూమని చెప్పిన ఏపీ.. తర్వాత అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టేనని నిరంజన్​రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పనులు ఆపకుంటే ఏపీ సీఎస్‌‌ను జైలుకు పంపుతామని గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ హెచ్చరించిందని, తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో పిటిషన్‌‌ వేయలేదని, వేరేవాళ్లు వేసిన పిటిషన్‌‌లో ఇంప్లీడ్‌‌ అయ్యామని చెప్పారు. నీళ్లు, వనరుల దోపిడీ కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ను ఏర్పాటు చేశారని, ఇది పెద్ద కుట్ర అని అన్నారు. హైదరాబాద్‌‌ స్టేట్‌‌లో 180 టీఎంసీల నీళ్లు ఉపయోగించుకునేలా భీమా, అప్పర్‌‌ కృష్ణా, తుంగభద్రలో లెవల్‌‌ కెనాల్‌‌ ప్రాజెక్టులు ప్రతిపాదించారని, సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాక అవి లేకుండా పోయాయని, ఈ విషయాన్ని బచావత్‌‌ అవార్డు (కేడబ్ల్యూడీటీ-1)లో ప్రస్తావించారని మంత్రి చెప్పారు. కృష్ణా నీళ్లను వినియోగించుకునేందుకు సంపూర్ణ హక్కులు తెలంగాణకు ఉన్నాయన్నారు. శ్రీశైలానికి నీళ్లు రాకముందే మలుపుకొనేలా కొత్త ప్రాజెక్టులు కట్టి తీరుతామన్నారు. నీళ్ల హక్కులు లేనోళ్లు ఎగిరెగిరి పడుతుంటే అన్ని హక్కులు ఉన్న జోగులాంబ ప్రాజెక్టుకు ఎవరు అడ్డం వస్తరో చూస్తామని హెచ్చరించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపకుండా కృష్ణా బోర్డు ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. 

ఇంటి దొంగలే కారణం

నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడానికి ఇంటిదొంగలే కారణమని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ఇప్పుడు టీఆర్‌‌ఎస్​ను విమర్శించినోళ్లంతా అప్పుడు పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా వ్యాసాలు రాశారని, మంగళహారతులు పట్టారని మండిపడ్డారు. ఏపీలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా ఏ పార్టీ వాటిపై కేసులు వేయదని, తెలంగాణల మాత్రం మన ప్రాజెక్టులపై వందలకొద్దీ కేసులు వేశారని, రాజకీయాల కోసం చేసే విమర్శలను పట్టించుకోవద్దని అన్నారు. రైతుబంధుపై సాయం అందుకుంటున్న వారిలో 90 శాతం మందికి ఐదు ఎకరాల లోపే భూములున్నాయని నిరంజన్​రెడ్డి చెప్పారు.