‘ఫ్రెష్​’గా గుండెని ప్రింట్​ చేద్దాం

‘ఫ్రెష్​’గా గుండెని ప్రింట్​ చేద్దాం

గుండె జబ్బులతో ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. కొందరికి గుండె మార్పిడి చేయాల్సి వస్తోంది. కానీ, గుండె దొరకడం అంటే మామూలు మాట కాదు కదా. అట్లాంటి అవసరం ఉన్న వాళ్ల కోసమే గుండె మొత్తాన్ని త్రీడీ ప్రింట్​ తీసే కొత్త పద్ధతిని అమెరికాలోని కార్నెజీ మిలన్​ యూనివర్సిటీ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. గుండె మొత్తాన్ని త్రీడీ ప్రింట్​ తీసేయొచ్చట. మనిషి శరీర నిర్మాణంలో కీలకమైన కొలాజెన్​ అనే ప్రొటీన్​తో గుండెను త్రీడీ ప్రింట్​ తీయొచ్చని సైంటిస్టులు చెప్పారు. ఈ టెక్నిక్​ను ఫ్రీఫార్మ్​ రివర్సిబుల్​ ఎంబెడ్డింగ్​ సస్పెండెడ్​ హైడ్రోజెల్స్​ (ఫ్రెష్​) అని పిలుస్తున్నారు. కణాలు, కొలాజెన్​ను వాడుకుంటూ గుండె గోడలు, వెంట్రికిల్ ను ప్రింట్​ తీశామని, అవి పూర్తిగా పనిచేస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.

‘‘రోగి గుండె ఎంఆర్​ఐ డేటా ఆధారంగా ఆ రోగికి సరిపోయే గుండెను కచ్చితత్వంతో ప్రింట్​ చేయగలిగాం” అని చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ అవయవ దాతలు దొరకరు కాబట్టి, కృత్రిమ అవయవాలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని చెబుతున్నారు. ఫ్రెష్​ త్రీడీ టెక్నిక్​ ద్వారా కొలాజెన్​ గట్టిపడేలా ఓ జెల్​ను కలిపి పొరలుపొరలుగా గుండెలా త్రీడీ ప్రింట్​ తీశారు. తర్వాత రూం టెంపరేచర్​ వద్దే ఆ ప్రింట్​ తీసిన గుండెకు అంటిన జెల్​ను కరిగించేశారు. దానిని వేడి చేసినా ప్రింట్​ తీసిన గుండెకి ఎలాంటి డ్యామేజ్​ జరగలేదు. పెద్ద సంఖ్యలో కృత్రిమంగా అవయవాలను తయారు చేయడానికి ఇదో మంచి టెక్నిక్​ అవుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఒక్క కొలాజెన్​తో కాకుండా ఫైబ్రిన్​, ఆల్జినేట్​, హయాలురోనిక్​ యాసిడ్​  వంటి మృదువైన జెల్స్​తోనూ వాటిని త్రీడీ ప్రింట్​ తీయొచ్చని అంటున్నారు. అంతేకాదు, అందరికీ అందేలా ఓపెన్​సోర్స్​ డిజైన్​ను తయారు చేశారు.మెడికల్​ ల్యాబులు, స్కూళ్లలో సైన్స్​ క్లాసులకూ వాటిని వాడుకునే అవకాశం కల్పించారు. వాటి ధర కూడా చాలా తక్కువే ఉంటుందని చెబుతున్నారు.