
దాదాపు ప్రతీ తల్లీదండ్రి తమ పిల్లలకు అన్ని విషయాల్లో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ల లైఫ్‌లో సాధించలేకపోయింది పిల్లలు సాధిస్తుంటే చూసి ఆనందిస్తారు. అందుకు ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారు. అలాంటిదే అభిజిత్ మూత అనే బ్యాంకింగ్ అనలిస్ట్ తన లింక్డిన్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఉబెర్ ఆటో డ్రైవర్ స్టోరీ కూడా.
పుణెకు చెందిన అభిజిత్ ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నాడు. అతను వెళ్లి ఆటో ఎక్కేలోపు, ఆ ఆటో డ్రైవర్ రాకేష్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ కనిపించాడు. అభిజిత్ వెళ్లడం చూసి వీడియో ఆపేసి గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాడు. అది గమనించిన అభిజిత్ ‘‘ఏం వీడియోలు చూస్తున్నావ’’ని అడిగాడు. అప్పుడు ఆటో డ్రైవర్ రాకేష్ ‘‘యుపిఎస్‌సికి సంబంధించిన సోషియో ఎకనామిక్ క్లాస్‌లు సార్’’ అని చెప్పాడు. దానికి అభిజిత్ ‘‘వాటితో నీకు పనేంటి? ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నావా?’’ అని అడిగితే... ‘‘నేను పదో క్లాస్ వరకు చదువుకున్నా. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చదువు మానేసి ఆటో నడపడం మొదలుపెట్టా. అదే ఇప్పుడు ఇన్‌కం సోర్స్ అయింద’’ని తన స్టోరీ చెప్పాడు. అయితే ఇప్పుడు అతను వినే క్లాస్‌లు తన కూతురికోసం. రాకేష్ కూతురు యుపిఎస్‌సి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతోంది. కూతురికి సాయంగా ఉంటుందని సోషియో ఎకనామిక్ క్లాస్‌లు వింటున్నాడు. ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా చదువుతాడట. సాయంత్రం అయ్యాక లైబ్రరీనుంచి కూతుర్ని తీసుకొని ఇంటికెళ్లి అప్పటివరకు ఇద్దరూ ప్రిపేర్ అయిన టాపిక్స్ డిస్కస్ చేస్తారు. దానివల్ల కూతురికి చాలా హెల్ప్ అవుతోంది అంటున్నాడు రాకేష్.