
టెక్నాలజీ కారణంగా సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే సొంతంగా వెహికల్ ఉండాల్సిన పనిలేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు. ప్రపంచం మొత్తం చుట్టేయొచ్చు. సెల్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఇంటి వద్దకే వాహనాలు వచ్చేస్తున్నాయి. ఈ తరహా సేవలు నగరాలు, పట్టణాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు సర్వీసులు అందిస్తున్నాయి. ప్రయాణికులను సకాలంలో గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి.
మహారాష్ట్రలోని ముంబయిలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం వ్యవహరించి ఓ మహిళా ప్రయాణికురాలిని ఎయిర్ పోర్టుకు లేట్ గా తీసుకెళ్లాడు. సమయం మించిపోవడంతో ఆమెకు ఫ్లైట్ మిస్సయ్యింది. ఈవిధమైన సేవాలోపం చేసినందుకుగానూ ఉబర్ సంస్థను జిల్లా వినియోగదారుల కోర్టు దోషిగా తేలుస్తూ రూ. 20,000 జరిమానా విధించింది. సేవల్లో లోపానికిగానూ రూ.10,000, ప్రయాణికురాలిని మానసిక వేదనకు గురిచేసినందుకు మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశాలిచ్చింది.
డోంబివిలి ప్రాంతానికి చెందిన కవితా శర్మ అనే న్యాయవాది 2018 జూన్ 12న సాయంత్రం 5:50 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి చెన్నైకి విమానంలో వెళ్లాల్సి ఉంది. ఆమె తన ఇంటి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం కోసం మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషాలకు ఉబర్ క్యాబ్ ను బుక్ చేసుకుంది. ఆమెకు కేటాయించిన కారు డ్రైవర్ 14 నిమిషాలు ఆలస్యంగా ఆమె ఇంటికి వచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత కూడా డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. ఫ్లైట్ సమయం మించిపోతుందని ఎయిర్ పోర్టుకు వెళ్లాలని ఆమె ఎంత చెప్పినా.. డ్రైవర్ వినిపించుకోలేదు. ఫోన్ లో సంభాషణ అయిపోయిన తర్వాతనే కారును స్టార్ట్ చేశాడు. అంతేకాదు ఆ క్యాబ్ డ్రైవర్ రాంగ్ రూట్ లో సీఎన్జీ స్టేషన్ కు కారును తీసుకెళ్లి 15 నుంచి 20 నిమిషాల టైం వృథా చేశాడు. అక్కడి నుంచి అతను సాయంత్రం 5 గంటల 23 నిమిషాలకు ఎయిర్ పోర్టులో దించాడు. అప్పటికే విమానం వెళ్లిపోయింది. అనంతరం ఆమె సొంత ఖర్చులతో తర్వాతి విమానంలో చెన్నైకి వెళ్లిపోయారు.
క్యాబ్ బుక్ చేసిన సమయంలో పేమెంట్ రూ.563 అవుతుందని ఉబర్ పేర్కొంది. కానీ ఎయిర్ పోర్టులో దిగిన తరువాత రూ. 703 అని చూపించింది. దీంతో అడిగినంత మొత్తాన్ని ఆమె డ్రైవర్ కు చెల్లించింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అనైతిక ప్రవర్తన కారణంగా ఆమె తన విమానాన్ని కోల్పోయానని పేర్కొంటూ ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉబర్ ఆమెకు రూ.139 రీఫండ్ చేసింది. ఈ విషయాన్ని బాధితురాలు థానే అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో ఫిర్యాదు చేశారు. పలు దఫాల చర్చల తరువాత చివరికి ఉబర్ ఆ మహిళా ప్రయాణికురాలికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.