బోర్డు తిప్పేస్తున్న క్రెడిట్ సొసైటీలు

బోర్డు తిప్పేస్తున్న క్రెడిట్ సొసైటీలు
  • ఆదర్శ్​, ముద్రలాగే ఉజ్వల క్రెడిట్​ సొసైటీ దివాలా
  • అధిక వడ్డీ ఆశచూపి అసలుకే ఎసరు పెట్టిన సంస్థలు
  • ఏండ్లు గడుస్తున్నా డిపాజిట్లు రాక బాధితుల ఆందోళన

మంచిర్యాల, వెలుగు :  ‘‘మా సంస్థలో డిపాజిట్లు చేయండి. అతి తక్కువ కాలంలోనే రెట్టింపు రిటర్న్స్​ పొందండి’’  అంటూ ఆకర్షణీయ ప్రకటనలతో  అమాయక ఖాతాదారులను బుట్టలో వేసుకుంటున్న క్రెడిట్ సొసైటీలు రాత్రికిరాత్రే బోర్డులు తిప్పేస్తున్నాయి. ప్రజల దగ్గర కోట్ల రూపాయలు వసూలుచేసి వారి నెత్తిన టోపీ పెడుతున్నాయి. గతంలో మంచిర్యాల జిల్లాలో ఆదర్శ్​ క్రెడిట్  సొసైటీ, ముద్ర సంస్థలు జనాలను మోసం చేశాయి. తాజాగా ఉజ్వల క్రెడిట్ సొసైటీ బాగోతం వెలుగులోకి వచ్చింది. 

స్మాల్​ సేవింగ్స్​ స్కీమ్​ పేరుతో మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో  పేదలు, చిరువ్యాపారుల నుంచి ఉజ్వల క్రెడిట్  సొసైటీ రూ.3 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి వారిని మోసం చేసింది. ఈ సంస్థ నిర్వాహకులపై రెండు జిల్లాల్లో కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం వారు కరీంనగర్​ జైల్లో ఉన్నారు. ప్రజల దగ్గర సేకరించిన సొమ్మును రియల్​ ఎస్టేట్, స్టాక్  మార్కెట్​తోపాటు ఇతర వ్యాపారాల్లో  పెట్టుబడులు పెట్టడం, నిధులను దారి మళ్లించడం వంటి కారణాలతో క్రెడిట్  సొసైటీలు దివాలా తీశాయి. దీంతో భవిష్యత్తులో క్రెడిట్​ సొసైటీల పేరు వింటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అడ్రస్​ లేని ఆదర్శ్ క్రెడిట్  కో ఆపరేటివ్  

ఆదర్శ్​ క్రెడిట్​ కో ఆపరేటివ్​ సొసైటీ లిమిటెడ్  తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి బోర్డు తిప్పేసింది. ఇందులో పెట్టుబడులు పెట్టినవారికి రెట్టింపు రిటర్న్స్​కాదు కదా, పైసా కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2017లో ప్రారంభమైన ఈ సంస్థ కేవలం రెండేండ్లలోనే 800కు పైగా బ్రాంచీలు, 20 లక్షలకు పైగా మెంబర్లు, 3.7 లక్షలకు పైగా ఇన్వెస్టర్లు, రూ.9 వేల కోట్లకు పైగా డిపాజిట్లతో దేశమంతటా విస్తరించింది. తెలంగాణలో 30 వేలకు పైగా సభ్యులు ఉండగా, సుమారు రూ.150 కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. 14 శాతం వడ్డీ ఇస్తామని మభ్యపెట్టి ఈ మేరకు డిపాజిట్లు సేకరించింది. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో ఆలోచించకుండా డిపాజిట్లు చేసిన కస్టమర్లు.. అటు అసలు రాక, ఇటు వడ్డీ లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మెచ్యూరిటీ గడువు ముగిసి ఏండ్లు గడుస్తున్నా డబ్బులు చేతికి రాక ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ సంస్థకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, జగిత్యాల, గోదావరిఖని, మంచిర్యాల, చెన్నూరు, కాగజ్​నగర్​ సహా రెండు తెలుగు రాష్ర్టాల్లో 65కుపైగా బ్రాంబీలు ఉన్నాయి. ఒక్క మంచిర్యాల బ్రాంచిలోనే రెండువేల మందికిపైగా మెంబర్లు, రూ.20 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఆదర్శ్​ క్రెడిట్​ సొసైటీలో 2020 జనవరి నుంచి లావాదేవీలు నిలిచిపోయాయి. ఆఫీసులన్నీ మూతపడ్డాయి. సంస్థ నిర్వాహకులు డిపాజిటర్ల సొమ్మును దుర్వినియోగం చేశారనే ఫిర్యాదులపై రాజస్థాన్​లో క్రిమినల్​ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్​, హర్యానా, న్యూఢిల్లీ, గుజరాత్​, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్​ రాష్ర్టాల్లో సంస్థకు ఉన్న రూ.1500 కోట్ల ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) అటాచ్  చేసింది. 

ఉజ్వలదీ అదే దారి 

మంచిర్యాల జిల్లా కేంద్రంగా 2020లో ఉజ్వల క్రెడిట్​కో ఆపరేటివ్​ సొసైటీ  లిమిటెడ్  ప్రారంభమైంది. మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, వేములవాడ, సిరిసిల్లలో బ్రాంచీలను తెరిచారు. ఏడాది నుంచి ఆరేండ్ల గడువుతో సుమారు 4 వేల మెంబర్ల నుంచి రూ.3 కోట్లకు పైగా ఫిక్స్ డ్​, రికరింగ్​ డిపాజిట్లు సేకరించారు. రెండేండ్ల వరకు లావాదేవీలు బాగానే సాగినా ఏడాది కిందట ఈ సంస్థ సంక్షోభంలోకి వెళ్లింది. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన డబ్బును సొసైటీ నిర్వాహకులు ఇతర వ్యాపారాల్లో మళ్లించారు. గత సంవత్సరం నుంచి డిపాజిటర్లకు చెల్లింపులు నిలిచిపోయాయి. 

దీంతో బాధితులు మొదట వేములవాడ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సిరిసిల్ల, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేటల్లో కూడా ఫిర్యాదు చేయడంతో సొసైటీ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. సంస్థ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు కరీంనగర్​  జైల్లో రిమాండ్​ ఖైదీలుగా ఉన్నారు. 

జనాలను ముంచిన ముద్ర 

‘‘ముద్రలో పొదుపు మీ బంగారు భవితకు మలుపు’’ అంటూ ముద్ర అగ్రికల్చర్​ అండ్​ స్కిల్​ డెవలప్​మంట్​ మల్టీస్టేట్​ కో ఆపరేటివ్​ సొసైటీ.. జనాల దగ్గర కోట్లలో డిపాజిట్లు సేకరించి నిండా ముంచింది. ఈ సంస్థ కూడా 2017లో ప్రారంభమై కొద్దికాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 15 బ్రాంబీలను ప్రారంభించింది. రెండువేలకు పైగా మార్కెటింగ్​ సూపర్​వైజర్లను నియమించుకొని వారి ద్వారా డిపాజిట్లు సేకరించింది. 8.33 నుంచి 12 శాతం వడ్డీతో రోజువారి, నెలవారి సేవింగ్​ స్కీమ్​లు ప్రారంభించింది. 

ఒక్క తెలంగాణలోనే రూ.150 నుంచి రూ.200 కోట్ల డిపాజిట్లు సేకరించింది. 2020లో సంక్షోభం తలెత్తడంతో ఉద్యోగులను తొలగించి బ్రాంబీలను మూసేసింది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ సంస్థపై కేసులు నమోదయ్యాయి. మూడేండ్లు కావస్తున్నా డిపాజిటర్లకు న్యాయం జరగలేదు. భవిష్యత్తుపై ఆశతో పెట్టుబడి పెట్టిన చిరువ్యాపారులు, రైతులు, కూలీలను ఈ సంస్థ మోసం చేసింది.