వాతావరణ మార్పులతోనే మండే ఎండలు

వాతావరణ మార్పులతోనే మండే ఎండలు

లండన్: ‘లండన్​లో మండుతున్న ఎండలకు కారణం గ్లోబల్​ వార్మింగ్.. ఇప్పటికైనా పర్యావరణానికి నష్టం కలిగించడం మానుకోండి’ అంటూ భారీ సంఖ్యలో ఆందోళనకారులు లండన్​ వీధుల్లో శనివారం ర్యాలీలు తీశారు. పెద్ద ఎత్తున పొల్యూషన్​కు కారణమవుతున్న చమురు, గ్యాస్​ ఉత్పత్తిని కంట్రోలో చేయాలని నినాదాలు చేశారు. కొత్త లైసెన్సులు ఇవ్వడం ఆపేయాలని డిమాండ్​ చేశారు. కాలుష్యాన్ని తగ్గించే చర్యలను వేగవంతం చేయకుంటే  పార్లమెంట్​ ముందు ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కిందటి మంగళవారం దేశంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోందనే దానికి ఇది ఉదాహరణ అని ‘జస్ట్​ స్టాప్​ ఆయిల్’ సంస్థకు చెందిన ఇండిగో రంబెలో చెప్పారు. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు దేశం ఇంకా సిద్ధంకాలేదని వివరించారు. వారంపాటు కొనసాగిన హీట్​వేవ్​కారణంగా వేలాదిమంది చనిపోయారని, కార్చిచ్చులు చెలరేగి ఇండ్లు తగలబడిపోయాయని వివరించారు. ఒక దశలో ఎమర్జెన్సీ సిబ్బంది కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొందని రంబెలో తెలిపారు. గ్లోబల్​ క్లైమేట్​ ఎమర్జెన్సీపై కొన్నిసంవత్సరాలుగా  తాము ఆందోళన వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గ్లోబల్​ వార్మింగ్​ ప్రభావంమన కాళ్ల కిందికి చేరిందని, ఇప్పుడైనా ప్రభుత్వాలు మేలుకోవాలని కోరారు.

ఆగస్టులో ఇంకో హీట్​వేవ్..
కిందటి వారంలో యూకేలో రికార్డు స్థాయిలో నమోదైన టెంపరేచర్లు ఇప్పుడు కాస్త తగ్గాయి. అయితే, ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఆగస్టు మొదటి వారంలో టెంపరేచర్​ మళ్లీ 40 డిగ్రీలు దాటుతుందని హెచ్చరించారు. వచ్చే వారంలో బ్రిటన్​లో టెంపరేచర్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, సాధారణ సగటు ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగానే నమోదవుతుందని మెటరాలజిస్ట్​ అలెక్స్ డీకెన్​ చెప్పారు.