రష్యా దురాక్రమణపై ప్రపంచం స్పందించాలె

రష్యా దురాక్రమణపై ప్రపంచం స్పందించాలె
  • ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి 

ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. మిలిటరీ ఆపరేషన్ కు ఆమోదం తెలుపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు. ఇతర దేశాలేవైనా ఈ విషయంలో  కలగజేసుకుంటే.. తీవ్ర పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా దాడిపై ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. దురహంకారంతో పుతిన్  ఈ యుద్ధానికి కాలుదువ్వారని, తమను తాము రక్షించుకోవడంతో పాటు రష్యాకు ఎదురునిలిచి విజయం సాధిస్తామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా స్పష్టం చేశారు. ‘‘ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ సిటీలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా దురహంకారంతో ఈ యుద్ధానికి దిగింది. ఉక్రెయిన్ స్వశక్తితో రష్యాను ఎదుర్కొని విజయం సాధిస్తుంది’’ అని అన్నారు. తమ దేశంపై రష్యా అధ్యక్షుడు  పుతిన్ పూర్తి స్థాయిలో దురాక్రమణకు దిగారని, ఈ సమయంలో ప్రపంచం పుతిన్ ను నిలువరించాలని ఆయన అన్నారు. ఇది ప్రపంచ దేశాలు తక్షణం స్పందించాల్సిన సమయం అని డిమిత్రో కోరారు. ప్రస్తుతం యూరప్ తో పాటు యావత్ ప్రపంచ భవిష్యత్తు రిస్క్ లో ఉందని, తక్షణం రష్యాపై ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించాలని ఆయన కోరారు. ప్రపంచంలో రష్యాను ఒంటరిని చేయాలన్నారు. తమ దేశానికి ఆయుధాలు, క్షిపణులు, ఎక్విప్ మెంట్ అందించాలని, ఆర్థిక సాయం చేయాలని కోరారు.

ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్లిన రష్యన్ ఆర్మీ

ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా....రష్యా మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా ఆర్మీ. ఉక్రెయిన్ బలగాలు వెంటనే ఆయుధాలు విడిచి వెనక్కి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రష్యా బలగాలు.. ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్తున్నాయి. ఉక్రెయిన్పై నలువైపులా మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతోంది రష్యా. 

రష్యా చర్యలకు ప్రతి చర్యలతో ఉక్రెయిన్ అప్రమత్తమైంది. ఉక్రెయిన్ లో ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. నెల రోజుల పాటు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు, సమావేశాలు, సభలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. అవసరమైతే మరో 30 రోజులు ఎమర్జెన్సీ విధిస్తామని తెలిపింది ఉక్రెయిన్. రష్యా దాడులను తిప్పి కొట్టడానికి అన్ని విధాల సిద్ధమైంది ఉక్రెయిన్.  దేశ ప్రజలనుద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమీర్ జెలెన్ స్కీ. రష్యా ప్రెసిడెంట్ పుతిన్కు తాను ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడంలేదన్నారు. ఉక్రెయిన్ ప్రజల స్వతంత్రత, స్వేచ్ఛను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు జెలెన్ స్కీ.