అల్ట్రా హ్యూమన్ రింగ్.. అనుక్షణం హెల్త్ ట్రాకింగ్

అల్ట్రా హ్యూమన్ రింగ్.. అనుక్షణం హెల్త్ ట్రాకింగ్

శరీర ఉష్ణోగ్రత.. గుండె కొట్టుకునే రేటు.. రక్తపోటు.. నడిచిన దూరం సహా మరెన్నో వివరాలను అందించే అత్యాధునిక స్మార్ట్ వాచ్ లను మనం ఇప్పటిదాకా చూశాం. వీటిని మించిన ఫీచర్లతో ఒక స్మార్ట్ రింగ్ రాబోతోంది. దానిపేరే ‘అల్ట్రా హ్యూమన్ రింగ్’. ఈ ఉంగరాన్ని ధరిస్తే ఎంతో విలువైన ఆరోగ్య సమాచారం మీ ముంగిట ప్రత్యక్షం అవుతుంది. 

హెల్త్ ఫీచర్స్ తో వచ్చే స్మార్ట్  వాచ్ లలో ఆరోగ్యపరమైన  సమాచారాన్ని డిస్ ప్లే చేసేందుకు స్క్రీన్ ఉంటుంది. ఈ ఉంగరంలో స్మార్ట్ వాచ్ ను మించిన హెల్త్ ఫీచర్లు  ఉన్నప్పటికీ.. స్క్రీన్  మాత్రం ఉండదు. ఇది మన శరీరం నుంచి సేకరించే సమాచారాన్ని చూసుకునేందుకు మన స్మార్ట్ ఫోన్ లో అల్ట్రా హ్యూమన్ రింగ్ యాప్ ను డౌన్ లోడ్  చేసుకోవాల్సి ఉంటుంది. 

అల్ట్రా హ్యూమన్ రింగ్ లో శక్తివంతమైన మైక్రో బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒక్కసారి 100 శాతం రీచార్జ్ చేస్తే 6 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంటుంది. కాబట్టి ఈ రింగ్ ను చార్జింగ్ చేసే బెడద పెద్దగా ఉండదు. అల్ట్రా హ్యూమన్.కామ్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ రింగ్ కోసం ప్రీ ఆర్డర్ ను ప్లేస్ చేయొచ్చు. ప్రస్తుతం దీని ప్రీ ఆర్డర్ ధర రూ.18,999 ఉంది.  అథ్లెట్లు, ఫిట్ నెస్ పై అమితాసక్తి కలిగిన వారే టార్గెట్ గా ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తోంది. 

ఎన్నో సెన్సర్ల సమాహారం.. 

ఈ రింగ్ లో హార్ట్ రేట్ సెన్సర్, టెంపరేచర్ సెన్సర్, మోషన్ సెన్సర్ ఉంటాయి. హర్ట్ రేట్ సెన్సర్ మన గుండె కొట్టుకునే రేటును లెక్కిస్తుంది. టెంపరేచర్ సెన్సర్ మన శరీర ఉష్ణోగ్రతను కొలుస్తుంది. మోషన్ సెన్సర్ మన శారీరక కదలికలపై నిఘా పెడుతుంది. మనం రోజుకు ఎంత సేపు నిద్రపోతున్నాం.. ఎలా నిద్రపోతున్నాం.. నిద్ర మధ్యలో ఎన్నిసార్లు మేల్కొంటున్నాం అనే విషయాలన్నీ కూడా మోషన్ సెన్సర్ నమోదు చేస్తుంది. మన స్ట్రెస్ లెవల్స్ ను కూడా ఇది సూచిస్తుంది. ఈ మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని.. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఆరోగ్య ప్రణాళికలను ఎప్పటికప్పుడు సవరించుకోవచ్చు.

‘ఎం1’ సెన్సర్ వెరీ స్పెషల్ 

ఈ రింగ్ లో ఉన్న ‘అల్ట్రా హ్యూమన్ ఎం1’ అనే సెన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రక్తంలోని గ్లూకోజ్ (బ్లడ్ గ్లూకోజ్) స్థాయుల్లో చోటుచేసుకునే హెచ్చుతగ్గులను ఇది ట్రాక్ చేస్తుంది. ఈ వివరాలను ప్రధానంగా షుగర్ రోగులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సమాచారం ఆధారంగా మధుమేహులు అప్రమత్తమై..  వారి ఆహారపు అలవాట్లను, జీవనశైలిని ఆరోగ్యకర మార్గంలోకి మళ్లించేందుకు ఆస్కారం కలుగుతుంది. తద్వారా వారి జీవక్రియలు మెరుగై.. ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.

ఏయే ఫోన్లతో.. 

ఐఓఎస్ 14, దాని తర్వాతి వర్షన్లతో వచ్చిన అన్ని ఐ ఫోన్ మోడళ్లు.. ఆండ్రాయిడ్ 6, దాని తర్వాతి వర్షన్లతో వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్లతో అల్ట్రా హ్యూమన్ రింగ్ కనెక్ట్ అవుతుంది.