గద్వాల జిల్లా నడిగడ్డలో ఏకగ్రీవాల జోరు!

 గద్వాల జిల్లా  నడిగడ్డలో ఏకగ్రీవాల జోరు!
  • ఇప్పటి వరకు 38 జీపీల్లో యునానిమస్
  • పంతాలు, పట్టింపులకు పోకపోవడంతో సాఫీగా ఎలక్షన్స్

గద్వాల, వెలుగు: ఒకప్పుడు గ్రామపంచాయతీ సర్పంచ్  ఎన్నికలంటే వర్గాలు, కక్షలతో గ్రామాలు రగిలిపోయేవి. వార్డులకు కూడా ప్యానల్  పెట్టి నామినేషన్లు వేసేవారు. కానీ, ఈసారి సర్పంచ్  పదవితో పాటు పెద్ద సంఖ్యలో వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. 

జోగులాంబ గద్వాల జిల్లాలో ఈసారి ఏకగ్రీవాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల అభివృద్ధి, స్మశాన వాటికలకు స్థలం కోసం సర్పంచ్  స్థానాలను ఏకగ్రీవం చేసుకుంటూ గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నడిగడ్డలో మొదటి విడతలో 15 జీపీలు, రెండో విడతలో 18 జీపీలు, మూడో విడతలో ఇప్పటి వరకు 5 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మూడవ విడత నామినేషన్ల ఉపసంహరణకు టైం ఉండడంతో మరిన్ని జీపీలు ఏకగ్రీవమవుతాయని భావిస్తున్నారు. 

ఏకగ్రీవ పంచాయతీలు ఇవే..

జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత లో 106 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, అందులో 15 గ్రామపంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధరూర్  మండలం చిన్నపాడులో సవరన్న, ద్యాగదొడ్డిలో సావిత్రమ్మ, జాంపల్లిలో శారదమ్మ, ర్యాలంపాడ్ లో వెంకట రామిరెడ్డి, గట్టు మండలం తుమ్మలపల్లిలో గోవిందమ్మ, తారాపురంలో గౌడ్ల లక్ష్మి, ముచ్చోనిపల్లిలో పార్వతమ్మ, ఆరగిద్దలో బాలకృష్ణ నాయుడు, లింగాపురంలో శకుంతల, పెంచికలపాడులో కురువ ఆంజనేయులు, కేటిదొడ్డి మండలం  రంగాపురంలో పెద్ద జయన్న, చింతలకుంటలో రాజశేఖర్, గద్వాల మండలం ఈడుగోని పల్లిలో రాణి, కురవపల్లిలో సరస్వతి, ములకలపల్లిలో బోయ రాముడు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో విడతలో 74 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 18 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 

అయిజ మండలం జెడుదొడ్డి, గుడిదొడ్డి, కురవపల్లి, వెంకటాపురం, కృష్ణాపురం, రాజాపురం, టిటిదొడ్డి గ్రామాల సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మల్దకల్  మండలం బిజ్వారం, మంగంపేట, సద్దనోపల్లి, చర్ల గార్లపాడు, నీలిపల్లె సర్పంచ్  పోస్టులు ఏకగ్రీవమయ్యాయి. వడ్డేపల్లి మండలం జక్కిరెడ్డిపల్లి, జూలకల్లు, తనగల, కొంకల, వెంకట్రామ నగర్, రాజోలి మండలం పడమటి గార్లపాడు సర్పంచ్  స్థానాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

మూడో విడతలో ఎన్నికలు జరిగే మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో 5 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్, గోకులపాడు, చెన్నిపాడు, చండూరు, ఇటిక్యాల మండలం వావిలాల సర్పంచ్  పదవి ఏకగ్రీవం కాగా, మరిన్ని జీపీలు ఏకగ్రీవమయ్యే చాన్స్​ ఉందని అంటున్నారు. గద్వాల జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా, ఇప్పటివరకు 38 జీపీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 217 గ్రామపంచాయతీల్లో మాత్రమే ఎన్నికలు  జరగనున్నాయి.